calender_icon.png 3 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్ఞానభాండాగారం ఖిల్జీ చేతిలో నేలమట్టం

03-08-2025 12:09:14 AM

ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించి విశ్వగురువు ఖ్యాతిని పొందిన భారతదేశం అనేక గొప్ప విద్యాలయాలకు నెలవు. అందులో నలంద విశ్వవిద్యాలయానిది ఎప్పటికీ అగ్రతాంబూలమే. ప్రపంచంలోనే తొలి విశ్వవిద్యాలయంగా, క్రీస్తు శకంలోనే శాస్త్ర సాంకేతికతను పరిచయం చేసిన గొప్ప యూనివర్సిటీ అది. గణితం, ఖగోళశాస్త్రంలో అనేక కొత్త విషయాలను అక్కడ నేర్పేవారు.

అంతటి గొప్ప విశ్వవిద్యాలయంపై కొందరి దురాక్రమదారుల కన్నుపడింది. విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేశారు. విద్యాలయం తగలబడటానికి మూడు నెలలకు పైగా సమయం పట్టిందని కథలుకథలుగా చెబుతారు. ఈ విధ్వంసం వెనుక అనేక కథనాలు, వాదనలున్నాయి.

 హైదరాబాద్, విజయక్రాంతి : క్రీస్తు శకం 427లో స్థాపించిన నలంద విశ్వవిద్యాలయానికి ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా గుర్తింపు ఉంది. మధ్య యుగాల నాటి అతితక్కువ ముఖ్యమైన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ప్రసిద్ధి చెందినది. గుప్త సామ్రాజ్య చక్రవర్తి అయిన ఒకటవ కుమారగుప్తుడు.. ఈ విశ్వవిద్యాల యాన్ని స్థాపించాడు.

క్రీ.శ.5 వ శతాబ్దం నుంచి 13 వ శతాబ్దం వరకు సుమారు 800 ఏండ్లు విద్యాకేంద్రంగా విలసిల్లింది. వర్సిటీలోని గ్రంథాలయంలో 9 లక్షలకుపైగా పుస్తకాలుండేవని.. పది వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసించేవారని ప్రతీతి. దీన్ని బట్టి నలంద ఎంతటి జ్ఞానపీఠమో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి విశ్వవిద్యాలయంపై క్రీస్తు శకం 1190 ప్రాంతంలో తుర్కో మిలిటరీ జనరల్ భక్తియార్ ఖిల్జీ కన్నుపడింది. ఉత్తర, తూర్పు భారతదేశంపై దండ యాత్ర చేసినప్పుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినట్టు చరిత్రకారులు చెబుతారు. ఖిల్జీ సైన్యం పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం తగలబడటానికి మూడు నెలల సమయం పట్టిందని కథలు కథలుగా చెబుతారు.

విదేశీయులకు జ్ఞానం పంచిన కల్పతరువు

అంబేద్కర్ ఓవర్సిస్ లాంటి పథకాల కింద మన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ అప్పట్లో ఆసియా, టిబెట్, చైనా, కొరియా, జపాన్, శ్రీలంక నుంచి విద్యార్థులు, పండితులు ఇక్కడికి వచ్చి విద్యనభ్య సించేవారు. ఇలా పది వేల మందికిపైగా విద్యార్థులు, రెండు వేల మంది ఉపాధ్యాయులకు వసతి కూడా కల్పించింది. ప్రాచీన ఆయుర్వేద పద్ధతులు, ఖగోళశాస్త్రం, తర్కం, వ్యాకర ణం, గణితం నేర్చుకోవడానికి నలందకు వచ్చేవారు.

అంతే కాకుండా బౌద్ధ తత్వశాస్త్రానికి సంబంధించి ప్రస్తుతం అందు బాటులో ఉన్న జ్ఞానమంతా నలంద నుంచి వచ్చిందేనని బౌద్ధ గురువు దలైలామా ఓ సందర్భంలో చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం సుమారు ఏడువందల పాటు వర్ధిల్లింది. ఆకాలంలో ఇలాంటి విశ్వవిద్యాలయం ప్రపంచ దేశాల్లోనే ఎక్కడా లేదు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జి, బోలోగ్నా వర్సిటీ కంటే 500 ఏళ్ల ముందే నలంద ఏర్పడింది. అనక మంది విదేశీయులను ఆకర్షించింది.

మిలియన్ల కొద్దీ మాన్యుస్క్రిప్ట్‌లను కలిగి ఉన్న లైబ్రరీని కలిగి ఉండేది. అంతేకాకుండా నలంద ఆచార్యులకు ఇతర దేశాల్లో డిమాండ్ ఉండేది. అత్యుత్తమ ఆచార్యులు, మేధావులను చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, శ్రీలంకలకు బౌద్ధం, తత్వం బోధించేందుకు నలంద పంపించేది. ప్రస్తుత కాలంలోనూ మన ప్రొఫెసర్లు విదేశాలకు, అక్కడి ప్రొఫెసర్లు మన దేశానికి వచ్చి జ్ఞానాన్ని పంచుతున్నారంటే అది నలంద వేసిన బాటేనని చెప్పకతప్పదు.

మేథోసంపత్తి, సాంస్కృతిక వారసత్వంపై దాడి..

క్రీస్తు శకం 1193 ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో జరిగిన వరుస ఇస్లామిక్ దండయాత్రలకు ఖిల్జీ నాయకత్వం వహించాడు. తన క్రూరమైన సైనిక విధానాలతో అతడు ఇస్లామిక్ పాలనను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని చరిత్ర చెబుతోంది. నలంద వంటి ఇస్లామేతర జ్ఞాన సంస్థలను తన లక్ష్యానికి అడ్డంకులుగా భావించాడు. నలంద విశ్వవిద్యాలయంపై అతడి దాడి కేవలం ఆక్రమణ చర్యగా కాకుండా, శతాబ్దాల మేథో సంపత్తి, సాంస్కృతిక వారస త్వంపై వినాశకరమైన దాడిగా చరిత్రకారులు అభివర్ణిస్తారు.

ప్రస్తుత బీహార్‌లో ఉన్న నలంద, గుప్త సామ్రాజ్యం సమయంలో 5వ శతాబ్దంలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది. దీన్ని కేవలం ఒక విశ్వవిద్యాలయమే కాక భారతదేశ ప్రాచీన, సంస్కృతికి చిహ్నంగా చెప్పాలి. ఇక్కడ చదువుకున్న వారు బౌద్ధమతం, భారతీయ శాస్త్రాల జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆసియా అంతటా ప్రయాణించేవారు.

నలందను బౌద్ధ ప్రపంచానికి మేథో వెన్నెముకగా మార్చారు. అలాంటి వర్సిటిని ధ్వంసం చేసేందుకు భక్తియార్ ఖిల్జీ తన సైన్యంతో వచ్చినప్పుడు నలందను రక్షించే బౌద్ధ సన్యాసులు, పండితులు అతన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. కానీ  ఖిల్జీ తన సైన్యంతో నలందను ఆక్రమించుకొని క్రూరమైన ఊచకోతతో వేలాది సన్యాసులను వధించాడని చరిత్ర చెబుతోంది. దాంతో ఆగకుండా అపారమైన గ్రంథాలయ సముదాయాన్ని తగులబెట్టాడు.

ఇది భవనాలు లేదా పుస్తకాలను నాశనం చేయడం, తగతబెట్టడమే కాదు.. భారతీయ జ్ఞానం, సంస్కృతి, శతాబ్దాల విద్యా వారసత్వాన్ని తుడిచిపెట్టడమే నని చరిత్రకారులు చెబుతారు. భారతదేశంలోని ఇతర ఇస్లామిక్ పాలకులు మన దేశ విద్యా విధానాన్ని, సంస్కృతికి గౌరవించినప్పటికీ.. నలందపై భక్తియార్ ఖిల్జీ చర్య అత్యంత క్రూరమైన దాడుల్లో ఒకటిగా మిగిలిపోయిందంటారు.

నలందపై దాడిలో ఖిల్జీ ఒక్కడేనా?

నలంద విశ్వవిద్యాలయం నాశనమైన 8 శతాబ్దాల త ర్వాత దాని నాశనానికి సంబంధించి అనేక కథనాలు ప్రచా రంలో ఉన్నాయి. నలందపై దాడి చేసిన వారిలో ఖల్జీ ఒక్కరే లేరని మరికొంత మంది పాలకులు కూడా ఉన్నారనే వాద నలున్నాయి. ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యాలయం పోటీగా మారుతుందని భావించిన ఖిల్జీ దాన్ని నాశనం చేశారని కొందరంటుంటే.. బౌద్ధాన్ని నాశనం చేయడానికే నలందపై దాడి జరిగిందని మరికొందరు వాదిస్తుంటారు.

క్రీస్తు శకం 5వ శతాబ్దంలో హూణులు కూడా దాడి చేశారని, ఆ తర్వాత 8వ శతాబ్దంలోనూ బెంగాల్ రాజు దండయాత్ర చేశాడని ప్రచారంలో ఉంది. ఇలా ఆరు శతాబ్దాల కాలంలో నలంద క్రమంగా మరుగునపడింది. తర్వాత 1812లో పురావస్తు శాస్త్రవేత్త హామిల్టన్, 1861లో సర్ అలెగ్జాండెర్‌లు నలందను పురాతన విశ్వవిద్యాలయంగా గుర్తించారని పలు కథనాలు చెబుతున్నాయి.