11-11-2025 12:00:00 AM
ఆదిలాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మా సంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చేపట్టిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు డీసీసీబీ చైర్మన్ అడ్డీ బోజా రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదా యాల ప్రకారం రథానికి ప్రత్యేక పూజలు చేసి, రథోత్సవాన్ని ప్రారంభించారు.
మహిళలు మంగళహారతులతో ముందు నడవగా, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు, భక్తులు కోలాటాలాడుతూ, భజన సంకీర్తనలను ఆలపిస్తూసాగిన రథోత్సవ ఊరేగింపుతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు చేసిన శ్రీమన్నారాయణుని నామస్మరణతో గ్రామ పురవీధులన్నీ మారుమ్రోగాయి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.