కలెక్టరేట్లో జయశంకర్ జయంతి
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పాల్గొన్నారు. మొదటగా అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ జయంతి వేడుకలలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఆజన్మాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ఉద్యోగులు, మేధావులు, కళాకారులకు, తెలంగాణ ప్రజానీకానికి తెలియజెప్పి, స్వరాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు. ఆనాటి కాలంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ముందుండి నడిపించారని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని అధికారులు సమిష్టి కృషితో అభివృద్ధి చేసినప్పుడు ఆయనకి ఘనమైన నివాళి తెలిపారు. ఈ జయంతి వేడుకలలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఈడి ఎస్సి కార్పొరేషన్ శంకర్, డిఈఓ భోజన్న, జిల్లా ఖజానా అధికారి సరోజ, ఎల్డిఎం రామ్ గోపాల్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






