బెటాలియన్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
సత్తుపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని గంగారంలో గల 15వ పోలీసు బెటాలియన్, తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ బి. వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ... ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప విద్యావేత్త, తెలంగాణ సిద్ధాంతకర్తగా చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడిగా ఆయన సేవలను స్మరించారు. నాన్-ముల్కీ ఉద్యమం, సాంబార్–ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమం వంటి తెలంగాణ హక్కుల ఉద్యమాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన కళ్లారా చూడాలని ఎన్నోసార్లు ఆకాంక్షించిన జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే మరణించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.






