నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
అడ్వాన్సుడు టెక్నాలజీ సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
భూపాలపల్లి టౌన్, (విజయక్రాంతి): నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అడ్వాన్సుడు టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సందర్శించి అక్కడి ఆధునిక సాంకేతిక వసతులు,శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ వారి విద్య, లక్ష్యాలపై తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకమని, ఆధునిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. క్రమశిక్షణ, కృషితో లక్ష్య సాధనకు ప్రయత్నించాలని సూచించారు. అలాగే యువత మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, నైపుణ్యాభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, డీఎస్పీ సంపత్ రావు, సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్, సెంటర్ సిబ్బంది, విద్యార్థులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.






