16 April, 2026 | 3:09 AM

విదేశాల్లో ఉద్యోగావకాశాలు

16-04-2026 01:30 AM

యువత సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): విదేశాల్లో ఉద్యోగావకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టాంకామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

జర్మనీలో రీగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని, తెలంగాణ యువత ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఏడాది సుమారు 5 లక్షల ఉద్యోగాలు అవసరం ఉన్నాయ ని, అందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 90 వేల వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఏటీసీల ద్వారా 25 వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 4,000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

టాంకామ్ ద్వారా నాలుగు నెలల్లోనే జర్మన్ భాష శిక్షణ అందిస్తామని, ప్రైవేటు ఏజెన్సీల మోసాలకు గురికాకుండా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ యాక్ట్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇది యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు.