21-11-2025 03:22:40 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి
మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి
సదాశివనగర్,(విజయక్రాంతి): సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం గత రెండు రోజులుగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రచార నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను కలిసి అడ్మిషన్ల ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాలను పేద విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకొని, వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ కళాశాలలో చేరాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత అడ్మిషన్, ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్యా బోధన,ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం, పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన సొంత భవనాలు, వివిధ రకాల పోటీ పరీక్షలకు ఫిజిక్స్ వాలా మరియు ఖాన్ అకాడమీ ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా నీట్, ఐఐటి జిమెయిన్స్, EAPCET, సీఏ ఫౌండేషన్ సాధించుట కొరకు కోచింగ్ ఇవ్వడం, పచ్చదనం పరిశుభ్రత కలిగిన కళాశాల ప్రాంగణం, మంచి ఉత్తీర్ణత సాధించడం కొరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో అదనపు స్టడీ అవర్ల నిర్వహణ, మినరల్ వాటర్ సౌకర్యం, విశాలమైన క్రీడా మైదానం, వెనుకబడిన విద్యార్థుల కొరకు ప్రత్యేక తరగతులు,మానసిక ఉల్లాసం కొరకు ప్రతి శనివారం వివిధ రకాల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పరిసర ప్రాంత పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాల సదాశివనగర్ లో అడ్మిషన్ పొందాలని కళాశాల ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్ తెలిపారు. అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా తేదీ 19/11/2025 నాడు సదాశివ నగర్ లోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలను, తేదీ 20/11/2025 నాడు జడ్పిహెచ్ఎస్ ధర్మారావుపేట్, జడ్పీహెచ్ఎస్ పద్మజివాడి పాఠశాలలను సందర్శించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.