calender_icon.png 6 September, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి

06-09-2025 07:04:19 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారదులుగా పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. జర్నలిస్టు డేని పురస్కరించుకుని శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసిన ఆయన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషాతో కలిసి పలువురు జర్నలిస్టులకు పాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి ఎంతో విలువలతో కూడినదని, సమసమాజ స్థాపన కోసం జర్నలిస్టులు అనునిత్యం కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పరిపాలనలో లోటుపాట్లు జరిగినప్పుడు, అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు, దోపిడీ పెరిగిపోయినప్పుడు జర్నలిస్టులు వాటిపై అక్షర యుద్ధం చేయాలని, వ్యవస్థను, వ్యక్తులను గాడిలో పెట్టేందుకు కృషి చేయాలన్నారు. మారుతున్న కాలనుగునంగా జర్నలిస్టు వృత్తిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, వృత్తి నియమాలను పాటిస్తూ విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ నైపుణ్యతను ప్రదర్శించాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాభివృద్ధికి ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నామని, వివిధ అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయన్నారు. మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతీ అంశంపై దృష్టి సారించామని, నియోజకవర్గాభివృద్ధికి జర్నలిస్టుల సూచనలు, సలహాలు కూడా అందించాలన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో చెప్పామని, అనునిత్యం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులు ఆరోగ్యాల పట్ల, కుటుంబాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎంతో కాలంగా విలేకరులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించేందుకు కృషి మొదలు పెట్టామని, దీనిపై ఇప్పటికే కలెక్టర్ తో పలు దఫాలుగా చర్చించామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నింస్తామని చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్క జర్నలిస్టుకు ఇంటి జాగా వచ్చేందుకు తన వంతు ప్రయత్నం తప్పకుండా ఉంటుందని, దీనిలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు.