06-09-2025 07:07:44 PM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ చేసిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యం అవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమని, ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రైవేటు పట్టా భూముల రికార్డుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ వంటి అనేక కీలక బాధ్యతలు మన వద్ద ఉంటాయని తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని, వీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలని, ఎక్కడా అవకతవకలకు పాల్పడటానికి వీలు లేదని స్పష్టం చేశారు.
సిటిజన్ చార్ట్ ప్రకారం ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసిల్దార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని , గ్రామ పాలన అధికారుల పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు.3 సంవత్సరాల తర్వాత రెవెన్యూ శాఖకు గ్రామ పాలన అధికారుల రూపంలో విఆర్ఓ, విఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్లు తిరిగి మాతృ శాఖ (రెవెన్యూ) రావడం జరుగుతుందని అన్నారు. నేడు నియామక పత్రాలు పొందుతున్న అభ్యర్థులు వెంటనే విధులలో చేరాలని కలెక్టర్ ఆదేశించారు.