06-09-2025 09:48:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాయి. శోభాయాత్ర మార్గమంతా శానిటేషన్ పనులు నిర్వహించి, గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తు చేశారు. ప్రధాన కూడళ్లలో మొబైల్ టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించగా, మహిళలు, పిల్లలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, మెరుగైన లైటింగ్, జనరేటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
బంగల్ పేట్ చెరువు (వినాయక సాగర్) వద్ద ప్రత్యేక నిమజ్జన ఘాట్ సిద్ధం చేయబడింది. 5వ రోజు నుంచే క్రేన్లను వినియోగంలోకి తెచ్చి, 7, 9, 11న జరిగే నిమజ్జన కార్యక్రమాలకు సక్రమంగా వినియోగిస్తున్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనం సాఫీగా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకున్నారు. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరా పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ బృందాలను మోహరించారు. మురుగు కాలువల శుభ్రత, చెత్త తొలగింపు పనులు క్రమం తప్పకుండా కొనసాగించబడుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అనౌన్స్‌మెంట్‌లు చేస్తూ, ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు. అధికారులు మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశాం అని తెలిపారు.