06-09-2025 09:59:42 PM
శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో నరసింహారావు రైతు పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉద్యాన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాషా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సమృద్ధిగా చేపట్టాలని, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లభిస్తుందని రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాషా తెలిపారు. శనివారం శివంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామంలో నరసింహారావు పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రెవెన్యూ డివిజన్ అధికారి మైపాల్ రెడ్డి, శివంపేట్ వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, లివ్ పామ్ రిసోర్సెస్ కంపెనీ మేనేజర్ మరియు ప్రతినిధిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, రైతులు మరియు తదితరులు రాష్ట్ర ఉద్యానవన సంచాలకులు యాస్మిన్ భాషా పాల్గొని మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఉద్యాన సంచాలకులు మాట్లాడుతూ... రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలపై మొగ్గు చూపాలని, అందులో ఆయిల్ పామ్ పంట దేశంలో ఎ పంటకి లేనివిధంగా చట్టం ద్వారా ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకం ఉందని. ఆయిల్ పామ్ పంట సాగుకు అనుకూలంగా వుందని (ఆయిల్ పామ్ పరిశోదన స్థానం, పెదవేగి శాస్త్రవేత్తలు జిల్లాను సందర్శించి దృవీకరించగా, 2023-24 సంవత్సరం నుండి జిల్లాలో ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగు చేపట్టు రైతులకు మొక్కలపై రాయితితో పాటు నాలుగు సంవత్సరములు తోట నిర్వహణ మరియు అంతర పంటల సాగు కొరకు రాయితీ సొమ్మును రైతుల ఖాతాకు జమ చేయబడును అని తెలిపారు.
రైతులకు పంట దిగుబడితో అధిక లాభాలను చేకూర్చే ఆయిల్ ఫామ్ తోటల విస్తీర్ణం పెంచాలని, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు పై సందేహాలను నివృత్తి పరిచేందుకు రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుతో రాణిస్తున్న రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాల పై రాయితీ సదుపాయం కల్పించబడును. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన నాలుగు సంవత్సరముల తరువాత ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి వచ్చును అని అన్నారు.
ప్రస్తుతం ఒక్క టన్ను ఆయిల్ పామ్ గెల ధర రూ. 19,108/-. ఈ లెక్కన సంవత్సరమునకు రూ. 1,50,000/- ఆదాయం వచ్చును. ఖర్చులు పోను ఒక ఎకరానికి సంవత్సరమునకు రూ. 1,20,000/- పొందవచ్చు. అని తెలిపారు. రైతులు తమ ఆయిల్ పామ్ ఉత్పత్తులను ఫ్యాక్టరీ వరకు రవాణా చేసుకొనుటకు అధిక ఛార్జీలు కేటాయించవలసి రావడం వలన కంపనీ వారు రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి 15 కిలోమీటర్ లకు ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కంపనీ వారు గెలలను కొనుగోలు చేసిన తరువాత నియమ నిబందనల ప్రకారం 14 రోజులలోపు రైతు కాతాకు డబ్బు జమ చేయబడుతుంది అన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని, దీని వలన రెట్టింపు ఆదాయం పొందవచ్చని, ఒక ఎకరా వరి వేసే నీళ్ళతో 5 ఎకరాల ఆయిల్ పంట పండించవచ్చని, పైగా ఆయిల్ పామ్ పంట దేశంలో ఎ పంటకి లేని విధంగా చట్టం ద్వారా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా సంబధిత కంపెనీ కొనుగోలు చేస్తారని దొంగల, కోతుల బెడద లేని పంట కాబట్టి రైతులందరూ ముందుకు వచ్చి ఆయిల్ పంట సాగు చేపట్టాలని . మెదక్ జిల్లాలో 2023-24 సంవత్సరంలో 78 మంది రైతులు 336 ఎకరాలలో, 2024-25 సంవత్సరం లో 152 రైతులచే 533 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేపట్టడం జరిగినది. ఈ సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి మెదక్ జిల్లాకు 2500 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటల సాగు చేయుటకు ప్రణాళికా చేసుకోవడం జరిగినది. ఇప్పటివరకు 2008 ఎకరాలకి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, అందులోనుండి 388 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు పెట్టడం జరిగిందన్నారు.