06-01-2026 12:45:15 AM
ఢాకా, జనవరి ౫: బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత కొనసాగుతూనే ఉంది. ఆందోళనకారులు హిందువులను టార్గెట్ చేసి పొట్టనపెట్టుకుంటున్నారు. గడిచిన మూడు వారాల్లో దీపూ చంద్రదాస్, బజేశ్ బిశ్వాస్, అశోక్ సామ్రాట్, ఖోకోన్ చంద్రదాస్ దుండగుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో హిందువు హత్య ఘటన వెలుగుచూసింది. యశోర్ జిల్లాకేంద్రానికి చెందిన రాణాప్రతాప్ (45) జర్నలిస్టు. ఆయన ‘బీడీ ఖోబోర్’ అనే స్థానిక పత్రికకు యాక్టింగ్ ఎడిటర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఒక ఐస్ ఫ్యాక్టరీలోకి వెళ్లాడు.
తిరిగి బయటకు రాగానే సాయుధంగా వచ్చిన ముఠా ఆయన్ను అపహరించి పాయింట్ బ్లాంక్‌లో హతమార్చి అక్కడి నుంచి పరారైంది. తాజాగా ఘటనతో ఆ దేశంలో దుండగుల దాడుల్లో మృతిచెందిన హిందువుల సంఖ్య ఐదుకు చేరింది. విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో హిందువులను భయభ్రాంతులకు గురిచేసేందుకే దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.