06-01-2026 12:46:29 AM
న్యూఢిల్లీ, జనవరి 5 : ‘పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్ట్ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలిస్తున్నాం. సివిల్ సూట్ ఫైల్ చేస్తేనే సమగ్రంగా విచారణ జరపవచ్చు. ప్రాజెక్టు ఆపాలన్న మీ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించేలా చూడమని ఆదేశాలు ఇస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలంగాణకు సూచించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మూడు పరిష్కార మార్గాలను సుప్రీంకోర్టు సూచిం చింది. అలాగే ఈ ప్రాజెక్టు సమస్యను తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి అని సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తు తం ఈ ప్రాజెక్టు ప్లానింగ్ దశలోనే ఉంది కదా? ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్‌కి ఏపీ నిధులే వృథా అవుతాయి కదా? అని సీజేఐ పేర్కొన్నారు. అనంతరం, కేసు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా చేశారు. అందరి అభిప్రాయాలతోనే తదుపరి విచారణ కొనసాగిస్తామని సోమవారం సుప్రీంకోర్టులో సీజేఐ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా చేప ట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు.
ఈ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగా ణ ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపి స్తూ.. ‘పోలవరం--నల్లమలసాగర్ ప్రాజెక్టులో మేము నిబంధనలు ఉల్లంఘించ లేదు. కేవలం ప్లాన్ రెడీ చేసుకుంటు న్నాం’ అని వాదనలు వినిపించారు.
ఏపీ ఏకపక్షంగా ప్రాజెక్ట్ నిర్మాణం..
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియ ర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదన లు వినిపిస్తూ.. ‘వరద జలాల పేరుతో మాకు కేటాయించిన నీటి వాటాను తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుపై వెంట నే సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలి. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉంది. అవార్డు ప్రకారం ఉన్న నీటి కేటాయింపులను మించి వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని, గోదావరి జలాల్లో అవార్డు ప్రకారం కేటాయించిన 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తుందని తెలిపారు.
వరద జలాల పేరుతో అదనంగా మరో 200టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్ని స్తోంది అని వాదించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ముందుకెలుతుందని, పొరు గు రాష్ట్రాల సమ్మతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు కూడా ఏపీ ఉల్లంఘించిందన్నారు.
పోలవరం- నల్లమల్లసాగర్ ప్రాజెక్టుతో మా వాటా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతళృత్వంలో ఇటీవల కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఈ కమిటీకి ప్రాజెక్టును ఆపే అధికారం లేదు. కావున సుప్రీంకోర్టు వెంట నే జోక్యం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపాలి’ అని సుప్రీం కోర్టును అభిషేక్ సింఘ్వీ కోరారు.
ప్లానింగ్ అధికారం మాకుంది..
మరోవైపు.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదన లు వినిపిస్తూ.. ‘పోలవరం--నల్లమలసాగర్ ప్రాజెక్టులో మేము నిబంధనలు ఉల్లంఘించలేదు. కేవలం మేం ప్లాన్ రెడీ చేసుకుంటు న్నాం. వృథా అవుతున్న సముద్ర జలాలను మాత్రమే రాయలసీమకి అందించాలనుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రాజెక్టు మాత్రమే జాతీయ ప్రాజెక్టు కాదు. మా రాష్ట్ర అవసరాలపైన ప్లానింగ్ చేసుకునే అధికారం ఉంది. మేము పీఎస్‌ఆర్, డీపీఆర్‌ను తయారు చేస్తున్నాం’ అని తెలిపారు.
‘భవిష్యత్‌లో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరం ఏంటి? రాష్ట్ర అవసరాల కోసం ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుంటే అభ్యంతరం ఎందుకో? సీమలో కరవు ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికే ప్రాజెక్టు ప్రతిపాదన’ అని రోహత్‌గా వాదించారు. ఈ సందర్భంగా పరీవాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సీజేఐ సూచించారు. ‘అయితే, ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికీ నష్టం జరగదని ముకుల్ రోహత్ వాదించారు. -తెలంగాణ మాత్రం గోదావరిపై వందల ప్రాజెక్టుల నిర్మిస్తోందని ఏపీ తరపున మరొక న్యాయవాది జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు.
వందలాది ఎకరాలు, గ్రామాలకు ముంపే.. : తెలంగాణ ప్రభుత్వం ఆందోళన
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లోని వేలాది ఎకరాల భూములు, గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర జలశక్తి శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా టెండర్లు పిలవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అంతర్రాష్ట్ర జల ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని, ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలు ఎటువంటి అనుమతులూ మంజూరు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది.
ఈ నెల 12వ తేదీకి వాయిదా..
తెలంగాణ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం నల్లమల సాగర్ పనులను కొనసాగిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. సీజేఐ స్పందించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి మార్పులు లేదా మళ్లింపులు సాధ్యపడవని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందని, దీని ముందు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.
ఇటువంటి అంతర్రాష్ట్ర జల వివాదాల విషయంలో ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. దీనికి మను సింఘ్వీ బదులిచ్చారు. నిర్మాణ పనుల గురించి మాత్రమే కమిటీ ముందు ప్రస్తావించడానికి అవకాశం ఉందని, స్టే ఇచ్చే అధికారం లేదని వివరించారు. స్టే విషయంలో తుది నిర్ణయం/ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.
ఇవే పనులు మున్ముందు కూడా వాటిని రద్దు చేయడం అసాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముకుల్ రోహత్గీ తన వాదనలను వినిపిస్తూ పోలవరంతో ముడిపడి ఉన్న మిగిలిన రాష్ట్రాలు కూడా పరిశీలించిన తర్వాతే నల్లమల సాగర్ డీపీఆర్‌కు ఆమోదం లభిస్తుందని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించక ముందు నుంచే పోలవరం ప్రాజెక్టు ఉందని గుర్తు చేశారు. వాదనలను విన్న అనంతరం సీజేఐ ధర్మాసనం ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.