calender_icon.png 10 December, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల జన చైతన్య యాత్ర

09-12-2025 08:15:36 PM

*టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య

*ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా మహాసభ 

ఉప్పల్ (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కనీస సమస్యలను ఈ నెలాఖరుగా పరిష్కరించకపోతే జనవరిలో "రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జనచైతన్య యాత్ర" నిర్వహించి, వేలాదిమంది జర్నలిస్టులతో ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం అంబేద్కర్ భవన్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మేడ్చల్-మల్కాజ్ గిరి  జిల్లా మూడవ మహాసభ ఘంనంగా జరిగింది.

ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీడబ్ల్యూజేఎఫ్ ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదనీ,ఏ ఒక్క రాజకీయ పార్టీకి, పత్రికకు అనుబంధం కాదని స్పష్టం చేశారు. ఫెడరేషన్ లో జర్నలిస్టులందరికీ సమాన హక్కులు, బాధ్యతలున్నాయని చెప్పారు. ఈ మధ్య కొంతమంది స్వార్థపరులు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, సంఘం మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తుల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉన్న సంఘాల్లో ఒక సంఘం బిఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలికి అభాసుపాలైందని, మరో సంఘం అధికార పక్షాన నిలబడి అభాసు పాలవుతుందని, జర్నలిస్టుల పట్ల వారి సమస్యల పట్ల చిత్తశుద్దితో కూడిన నిబద్దతతో పనిచేసే ఏకైక సంఘం ఫెడరేషన్ అని అన్నారు.

రాష్ట్రంలో నెంబర్ సంఘంగా ఎదుగుతున్న తరుణంలో కొందరు స్వార్థ పరులు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నారని, ఆ కుట్రలో భాగంగానే బసవపున్నయ్య అనే వ్యక్తి సంఘాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడని మామిడి సోమయ్య మండిపడ్డారు. జర్నలిస్టుల జీవితాలను తాకట్టు పెట్టే విధంగా ఆయన వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. ఎదుగుతున్న సంఘాన్ని తన చేష్టలతో వెనుక్కి నెట్టి సంఘం పరువు తీశాడని అన్నారు. ఫెడరేషన్ ఎంతోమంది జర్నలిస్టుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని,ఈనాడు ఒక మంచి సంఘంగా గుర్తింపు పొంది జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటం చేస్తూ, జర్నలిస్టుల పక్షాన పోరాడే ఏకైక సంఘంగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ, కేంద్రం పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు. రైల్వే రాయితీ పాసులను జర్నలిస్టులకు తిరిగి ఇవ్వాలని కోరారు.

ఫెడరేషన్ కో- కన్వీనర్ వల్లాల జగన్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు రక్షణ చట్టం తక్షణం అమలు చేయాలన్నారు. మరో కో- కన్వీనర్ ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ కార్యాచరణ ప్రకటించాలని నేషనల్ కౌన్సిల్ మెంబర్ రమాదేవి డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు బొంగునూరి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మహాసభలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జెమినీ నాగరాజు గౌడ్, జగదీశ్వర్ గుప్తా, కుత్బుల్లాపూర్ కార్యదర్శి గోవింద రావు, వర్కింగ్ ప్రసిడెంట్ శివ,మాజీ సర్పంచ్ కావలి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యవర్గం

టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా కట్టెల మల్లేశం, ఉపాధ్యక్షులుగా కావలి మోహన్,మనం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా గడ్డమీది అశోక్, సహాయ కార్యదర్శులుగా శంకర్, సంతోష్ రెడ్డి, పర్వేజ్ అహ్మద్, సంయుక్త కార్యదర్శులుగా రమేష్, చిన్నబాబు, కోశాధికారిగా అమరేందర్ గౌడ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా బాల్ రాజ్ పటేల్, కార్యవర్గ సభ్యులుగా లింగారెడ్డి, సౌభాగ్య, రాజు, కొండల్ రెడ్డి, చైతన్య, రమేష్ తదితరులు ఎన్నికయ్యారు. నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపల్లి పద్మారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తన్నీరు శ్రీనివాస్, బెలిదె అశోక్, యావపురం రవి ఎన్నికయ్యారు.