21-10-2025 03:36:45 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు మంగళవారంతో ముగుస్తుంది. నేడు చివరి రోజు కావడంతో ఈ ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇతరులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 150కి పైగా నామినేషన్లు దాఖలు కాగా.. అభ్యర్థుల సంఖ్య 100 దాటినట్లు సమాచారం. 3 గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికే నామినేషన్ దాఖాలు చేసేందుకు అవకాశం ఉంటుందని, స్వతంత్ర అభ్యర్థులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పాల్గొంటున్నారు. ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ వికాస నాయకులతో పాటు మంగళవారం బీజేపీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డి షేక్‌పేట ఎంఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన భార్య ఇప్పటికే ఆయన తరపున ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
మంగళవారం ఉదయం దీపక్ వెంకటగిరి హైలాండ్ కాలనీ నుండి యూసుఫ్‌గూడ బస్తీ వరకు బీజేపీ డప్పులు, నృత్యాలు, వివిధ కళారూపాల మధ్య ర్యాలీ నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్యెల్యేలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీతా గోపీనాథ్, కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు అక్టోబర్ 22న ఈ నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.