calender_icon.png 12 November, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ పోలింగ్ 48.47 శాతం

12-11-2025 01:12:45 AM

  1. ఓటేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు, రాజకీయ, సినీ ప్రముఖులు
  2. కొన్నిచోట్ల మొరాయించిన ఈవీఎంలు
  3. డ్రోన్ల నిఘా నీడలో ప్రక్రియ.. 14న కౌంటింగ్
  4. ముగిసిన జూబ్లీహిల్స్ ఎన్నిక
  5. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్
  6. ఈవీఎంలలో నిక్షిప్తమైన 58 మంది అభ్యర్థుల భవితవ్యం
  7. 14న తేలనున్న ప్రజల నిర్ణయం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ర్టంలో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 48.47 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపుతో బరిలో ఉన్న 58 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ప్రశాంతంగా పోలింగ్ సరళి

ఉదయం 7 గంటలకు పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ప్రధాన పోలింగ్ ప్రారంభమైంది. తొలుత కాస్త మందకొడిగా సాగినా మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌యాదవ్ యూసుఫ్‌గూడలో, బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలో, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరితో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు వేశారు. ఈ ఉపఎన్నికను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

139 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 407 పోలింగ్ కేంద్రాల వద్ద 1,761 మంది రాష్ర్ట పోలీసులు, అదనంగా 800 మంది కేంద్ర బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉంచారు. ఎన్నికల నిర్వహణలో తొలిసారిగా, 139 డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిసరాలను నిరంతరం పర్యవేక్షించారు.

సాంకేతిక సమస్యలు, కోడ్ ఉల్లంఘనలు

పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే షేక్‌పేట్‌తో సహా మొత్తం 6 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓట ర్లు కాసేపు ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ బృం దాలు వెంటనే రంగంలోకి దిగి, యుద్ధప్రాతిపదికన ఈవీఎంలను సరిచేసి, పోలింగ్‌ను తిరిగి ప్రారంభించాయని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతున్న స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.