calender_icon.png 23 July, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరిశిక్ష బదులు 45 ఏళ్ల జైలు

11-05-2024 02:09:39 AM

హైవే కిల్లర్ల కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అమరావతి, మే 10 (విజయక్రాంతి): హైవే కిల్లర్స్‌గా పేరుపొందిన మున్నా ముఠా కు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. యావజ్జీవంలో భాగంగా 45 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాలని పేర్కొంది. ఈలోగా ఏవిధమైన క్షమాభిక్ష పెట్టరాదని స్పష్టం చేసింది. రహదారులపై పెట్రోలింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని  ఆక్షేపించింది. దీనికి బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పు న పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం ఖరారు చేసే విషయంలో ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం తీర్పుచెప్పారు. ఒంగోలును కేంద్రంగా చేసుకొని ప్రధాన నిందితుడు అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా ఆధ్వర్యంలో ఇనుపలోడుతో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న లారీలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడేవారు. లారీ డ్రైవర్, క్లీనర్లను హత్య చేసేవారు.  మృతదేహాలను గోనె సంచుల్లో కుక్కి పూడ్చిపెట్టేడారు. లారీని కనపడకుండా చేసేవారు. సరుకును దోచుకునేవారు. ఈ ముఠా 13 మందిని హత్యచేసినట్టు దర్యాప్తులో తేల్చారు. ఒంగో లు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు పలువురికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవం, ఒకరికి పదేళ్లు, ఇంకొకరికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ 2021లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లను హైకోర్టు విచారణ జరిపి పైవిధంగా కీలక తీర్పు వెలువరించింది. తొమ్మిది మందికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్పు చేసింది. వీరిలో మున్నా, షేక్ రియాజ్, బత్తుల సాల్మన్, ఏపూరి చిన వీరాస్వామి, సయ్యద్ హిదయతుల్లా ఇతరులు ఉన్నారు.