11-05-2024 02:13:57 AM
సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేతపై అసహనం
నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం
అమరావతి, మే 10 (విజయక్రాంతి): రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత, విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం తదితర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నిధుల పంపిణీ చేసేందుకు అనుమతించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ పిటిషన్ దాఖలైంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులకు అనుగుణంగా ఈసీ ఎన్వోసీ ఇవ్వలేదు. ఈ నెల 11 నుంచి 13 వరకు నిధుల పంపిణీ లేదా బదలాయింపు చేయరాదని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసినందున అప్పీల్ పిటిషన్‌ను విచారించి ప్రయోజనం ఏమున్నదని ధర్మాసనం ప్రశ్నించింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రూ.14,165 కోట్లను ఈ నెల 10న విడుదల చేయాలని, ఈ 11 నుంచి 13 వరకు విడుదల చేయరాదని గురువారం సింగిల్ జడ్జి ఈసీకి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అప్పీల్ చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు ఈసీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీచేసిన తర్వాత వాటిని ఎందుకు అమలు చేయలేదని ఈసీని ప్రశ్నించింది. కోర్టుల కంటే ఎక్కువని భావిస్తున్నారా? అని అడిగింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు నాదకర్ణి, దేవదత్ కామత్, మీనాక్షి అరోరా వాదనలు వినిపించేందుకు హాజరయ్యారు. జనవరి, మార్చి నెలల్లో ఇవ్వాల్సిన నిధులను ఎన్నికల ముం దు ఇవ్వడానికి సిద్ధం అవ్వడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నాదకర్ణి చెప్పారు. అధికారంలో లేని పార్టీలను దెబ్బతీయడమేనని కామత్ చెప్పారు. సింగిల్ జడ్జి ఆర్డర్ అమలును నిలిపివేస్తూ స్టేటస్‌కో ఇవ్వాలని అరోరా కోరారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని అర్ధరాత్రి రిజిస్ట్రీని ఎలా నిద్ర లేపుతారని మండిపడింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా వివరణ కోరతారని మండిపడ్డారు. దీంతో న్యాయవాదులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ: రాష్ట్రం
సింగిల్ జడ్జి ఉత్తర్వుల తర్వాత ఎన్వోసీ ఇవ్వాలని ఈసీని కోరితే ఇవ్వకుండా నిధుల పంపిణీ ఎందుకు జాప్యమైందని ఈసీ వివరణ కోరిందని ఏపీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ చెప్పారు. ఈసీ వ్యవహార శైలి సమర్థనీయంగా లేదని అన్నారు. పాత పథకాలకు గతంలో అనుమతిచ్చిన హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసిందని, ఇప్పుడు అడ్డుకుందని చెప్పారు. నిధులను పంపిణీ చేయాలని సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో లేదని ఈసీ తరఫు సీనియర్ అడ్వొకేట్ దేశాయ్ అవినాశ్ చెప్పడంపై బెంచ్ అసహనాన్ని వ్యక్తం చేసింది. విచారణను జూన్‌కు వాయిదా వేసింది. దీనిపై ఏజీ కల్పించుకుని, ఈసీ తీరుపై కచ్చితంగా విచారణ చేయాలని కోరారు. ఇష్టానుసారంగా ఈసీ చేయడానికి వీల్లేదనే విషయాన్ని హైకోర్టు తేల్చాలని విజ్ఞప్తిచేశారు. దీంతో విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది.