6 April, 2026 | 6:16 AM

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

07-05-2024 12:36 AM

రెండో విడత విచారణ షురూ

మూడు నివేదికలను కోరిన కమిషన్

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రెండో విడత విచారణను ప్రారంభించింది. అందులో భాగంగా మంగళవారం నాడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిం చనుంది. సోమవారంనాడు హైదరాబాద్ వచ్చిన పీసీ ఘోష్ కమిషన్‌కు నీటి పారుదల శాఖ అధికారులు స్వాగతం పలికారు. నగరంలోని ఒక హోటల్‌లో కమిషన్ ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ ఉ్నతాధికారులు కమిషన్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ మొదటి పర్యటనలో కోరిన మూడు ఫైళ్ళపై చర్చించినట్టు సమాచారం.

2015లో ఏర్పాటైన ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక తోపాటు బ్యారేజీలకు చేయాల్సిన మరమ్మత్తులపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక, అలాగే విజిలెన్స్ విభాగం అధికారులకు తమ విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న రికార్డులు, ఫైళ్లను అప్పగించాలని కమిషన్ ఆదేశించింది. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఆయా విభాగాలకు లేఖలు రాసినట్టు.. ఇంకా అక్కడి నుంచి సమాధానం రాలేదంటూ అధికారులు కమిషన్‌కు తెలిపారు. ఈ రెండో విడతలో కమిషన్ ఈనెల 12 వరకు హైదరాబాద్‌లో విచారణ చేసే అవకాశం ఉంది. మంగళవారం నాడు మేడిగడ్డను పరిశీలించేందుకు కమిషన్ వెళుతోంది. సమయం ఉంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనుకూడా పరిశీలించే అవకాశం ఉంది.

ఈనెల 9న బీఆర్‌కే భవన్‌లో కమిషన్‌కు కేటాయించిన కార్యాలయంలో అధి కారులతో విచారణకు సంబంధించిన అంశాలపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. ఈనెల 11 తారీఖు వరకు విచారణ చేసి.. ఈనెల 12న తిరిగి కొల్‌కత్తాకు కమిషన్ వెళ్ళనుంది. ఈనెల 9న బీఆర్‌కే భవన్‌లో విచారణ నాటికి కమిషన్ కోరిన నివేదికలను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కేంద్రంలోని ఎన్‌డీఎస్‌ఏ నుంచి మేడిగడ్డకు మరమ్మత్తులు, పునరుద్ధరణపై నివేదిక అందుతుందా.. లేదా అనేదానిపై సమాచారం లేదు. దీనితో అందుబాటులో ఉన్న నివేదికలు, రికార్డులు, ఫైళ్లను కమిషన్‌కు అందించే ప్రయత్నంలో నీటిపారుదల శాఖ ఉంది.