calender_icon.png 24 November, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం

24-11-2025 01:04:29 AM

  1. హర్యానా నుంచి సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యామూర్తిగా రికార్డు
  2. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
  3. న్యాయమైన, నిష్పక్షపాతమైన విమర్శను స్వాగతిస్తా
  4. మీడియాతో జస్టిస్ సూర్యకాంత్

న్యూఢిల్లీ, నవంబర్ 23 : సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హరియాణా వాసిగా జస్ట్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 

అంచెలంచెలుగా ఎదుగుతూ..

జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10 హరియాణాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేసి, రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి 1984లో న్యాయ శాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.

1985లో పంజాబ్ హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకూ హరియాణా అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. 2018 అక్టోబరు 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 

పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా..

రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. దీంతో పాటు వాక్ స్వాతంత్య్రం, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగ సమానత్వం వంటి కేసుల్లో ఆయన కీలక తీర్పులు వెలువరించారు. 

నా ముందున్నవి రెండే లక్ష్యాలు  

దేశ న్యాయవ్యవస్థ అధినేతగా తన ముందు లక్ష్యాలు ఉన్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.  ఒకటి దేశంలో పేరుకుపోయిన 4.6కోట్ల పెండింగ్ కేసుల పరి ష్కారం కాగా మరొకటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కరానికి మధ్యవర్తిత్వానికి ఊతమివ్వడమని తెలిపారు. ఆదివారం ఆయన తన అధికారిక నివాసం లో మీడియాతో మాట్లాడారు.

న్యాయమైన, నిష్పక్షపాతమైన విమర్శను ఎల్ల వేళలా స్వాగతిస్తానని చెప్పారు. ఒక్క సుప్రీం కోర్టులోనే 90వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. అయితే ఇలా ఎందుకు జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు అన్న వివరాల్లోకి తాను వెల్లదలచుకోలేదని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులపై హైకోర్టుల నుంచి నివేదికలు కోరుతానని చెప్పారు. వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని ఆయన సూచించారు.