24-11-2025 01:02:34 AM
పంజాబ్ సీఎంతో సహా, కాంగ్రెస్, అకాలీదళ్ నేతల స్పష్టీకరణ
నగరాన్ని లాక్కోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక
చండీగఢ్, నవంబర్ 23 : పంజాబ్ రాజధాని చండీగఢ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేజిక్కించుకోవాలని కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ ఆరోపించారు. ‘ఈ నగరాన్ని నిర్మించేందుకు తమ గ్రామాలు నాశనం చేశారు.. పంజాబ్‌కు దానిపై పూర్తి హక్కు ఉంది.. చండీగఢ్‌ను వదులుకోబోమని’ స్పష్టం చేశారు.
అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంజాబ్, హరియాణా సంయుక్త రాజధాని చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లును పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.
పంజాబ్ గుర్తింపుపై దాడి: కేజ్రీవాల్
పంజాబ్ గుర్తింపుపై ముమ్మాటికీ కేంద్రం దాడి అని ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల అభివర్ణించారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. చండీగఢ్ పంజాబ్‌కు చెందినదేనని మరో వైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
దానిని లాక్కోవాలని చూస్తే పరిణమాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు పంజాబ్ పక్షాన ఉంటారో.. కేంద్రం తరఫున ఉంటారో తేల్చుకోవాలని అన్నారు. అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా ఇది పంజాబ్ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు.
బిల్లు ఆమోదం పొందితే..
131 సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి గాను రాజ్యాంగ అధిక రణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురానుంది. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనికి పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నాయి.
పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ప్రణాళిక లేదు
చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేలా రాజ్యాంగ సవరణ అధికరణ 131 సవరణ బిల్లుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని హోమంత్రిత్వ వాఖ వెల్లడించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే ప్రణాళిక లేదని.. అందరితో చర్చలు జరిపిన తర్వాతే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదనను పంజాబ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పదించింది. ‘చండీగఢ్ చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఈ ప్రతిపాదనలో చండీగఢ్ పరిపాలన, పంజాబ్, హరియాణాతో దాని సంబంధాల గురించి ఏమీ లేదు. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. అందరినీ సంప్రదించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం.. ’ అని హోమంత్రిత్వ వాఖ అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.