calender_icon.png 11 November, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ గిరిజనులు తోటీలు!

31-07-2024 12:00:00 AM

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గోండులతో పాటు తోటీలు కూడా నివసిస్తున్నారు. వీరిలో కొందరు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నారు. తోటీలు తమను తాము బిరుదు గోండలుగా చెప్పుకుంటారు. ‘తోటి అనే పదం ‘తండు’ అనే పదం నుంచి వచ్చింది. ఇయ్యవలసిన ధనాన్ని అడిగేవాడని లేదా ధనాన్ని వసూలు చేసేవాడని ‘తండు’ పదానికి అర్థాలు ఉన్నాయి. అంతేకాక తోటీలు వార్తను ప్రచారం చేసేవాళ్ళుగానూ, గోండుల పంచాయతీ సభకు సభ్యులను పిలుచుకొని వచ్చేవారుగాను ఉంటారని తెలుస్తున్నది. వీరు గోండులకు అత్యంత సన్నిహితులుగాను, నమ్మకమైన సేవకులుగాను ఉంటారు. తోటీలు సేవలకు నిదర్శనంగా ఒక నానుడి ఏర్పడింది. ‘నీవు తోటీల వలె పనిచేస్తే నీవు రాజభోగాలను అనుభవించవచ్చు’ అని గోండులు తోటీలను గురించి చెప్తుంటారు. అంతరించిపోతున్న గిరిజన జాతుల్లో తోటీలు కూడా ఉన్నారు.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గోండులతో పాటు తోటీలు కూడా నివసిస్తున్నారు. వీరిలో కొందరు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నారు. తోటీలు తమను తాము బిరుదు గోండలుగా చెప్పుకుంటారు. ‘తోటి’ అనే పదం ’తండు‘ అనే పదం నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఇయ్యవలసిన ధనాన్ని అడిగేవాడని లేదా ధనాన్ని వసూలు చేసేవాడని ’తండు‘ పదానికి అర్థాలు ఉన్నాయి. అంతేకాక తోటీలు వార్తను ప్రచారం చేసేవాళ్ళుగానూ, గోండుల పంచాయతీ సభకు సభ్యులను పిలుచుకొని వచ్చేవారుగాను ఉంటారని తెలుస్తుంది. వీరు గోండులకు అత్యంత సన్నిహితులుగాను, నమ్మకమైన సేవకులుగాను ఉంటారు. తోటీలు సేవలకు నిదర్శనంగా ఒక నానుడి ఏర్పడింది. ’నీవు తోటీల వలె పనిచేస్తే నీవు రాజభోగాలను అనుభవించవచ్చు‘ అని గోండులు తోటీలను గురించి చెప్తుంటారు. అంతరించిపోతున్న గిరిజన జాతుల్లో వీరు కూడా ఉన్నారు.

ప్రధానులు ఏ ఏ పనులు గోండులకు చేస్తారో ఆ పనులన్నింటిని తోటీలు కూడా చేస్తారు. ప్రధానులు గోండుల గాయకులు. వారి పురాణగాథలను వారు గానం చేస్తారు. అలాగే తోటీలు కూడా గోండుల పురాణ గాథలను గానం చేస్తారు. ఇలా చాలా విషయాల్లో ప్రధాన్ల వలెనే తోటీలు గోండులకు సహకరిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన్లు మరాఠీభాషను మాట్లాడుతారు. కానీ తోటీలు గోండి భాషను మాట్లాడతారు. దీన్ని బట్టి గోండులు తోటీల మధ్య ఉన్న సంబంధం, ప్రధాన్ లకు గోండులకు మధ్య ఉన్న సంబంధం కంటే ముందు నుంచి ఉన్నదని తెలుస్తుంది. తోటీలు సామాజిక స్థాయిలో ప్రధాన్ల కంటే తక్కువవారుగా చూడబడతారు. 

గోండులకు ప్రధాన్లు అన్ని కార్యాల్లో సహకరించి ధనం దానంగా తీసుకోవడం బాధ్యతగా భావిస్తారు. కానీ తోటీలు గోండులకు సేవ చేసి ధనం ప్రతిఫలంగా గ్రహిస్తారు. ఇలాంటి సామాజిక స్థాయి భేదం ప్రధాన్లకి తోటీలకి మధ్య ఉంటుంది. 

తోటీలు ఎక్కువగా భీమదేవుని గురించి పాటలు పాడుతారు. తోటీ మహిళలు పచ్చబొట్టు వేయడంలో నిష్ణాతులు. వీరు గోండు స్త్రీలకు పచ్చబొట్లు వేసి ధనం గానీ, ధాన్యం గానీ తీసుకుంటారు. 

ఆర్థిక వ్యవస్థ..

తోటీలు కొందరు గోదావరి తీరప్రాంతాలకు వలస వెళ్లారు. వారు ఆ ప్రాంతంలో గోండులు లేకపోవడంవల్ల ’తోటి‘ కళారూపాన్ని నేర్చుకుని, దానికి అనుబంధంగా కిన్నెరను తయారు చేసుకుని, వాటికి తోడు మృదంగం తాళాలతో అన్ని కులాల వారికి మహాభారత కథలు చెప్తూ ”పాండవులోళ్ళుగా“ ప్రసిద్ధి చెందారు. పాండవుల కతకు గ్రామాల్లో ప్రజాదరణ పెరగడం వల్ల వీరికి ఆదాయం లభించింది. అలాగే కొంతమంది పటం కళాకారులకు వాద్య సహకారం అందించి ఆదాయం పొందడమేగాక ”పటం కథా“ నేర్చుకుని నాయకపోడుల ఉత్పత్తిని, పద్మనాయకుల వృత్తాంతాన్ని పటం వేయించి పటం కథా ప్రదర్శనతో నాయకపోడులకు ఆశ్రితులుగా జీవనం సాగిస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని తోటీలు గోండులకు ఆశ్రితులుగా ఉంటూ వారి పరిసర ప్రాంతాల్లోని స్థితిగతులను, సంబంధ బాంధవ్యాలను, బంధుత్వాలను, వారికి తెలుపుతారు. గోండురాజులకు పెళ్లి సంబంధాలు చూడటం, వంశ పురుషుల వీరగాథలు చెప్పడం, పండుగలు, పెళ్లిళ్లు, కర్మకాండలు మొదలైన వాటికి గోండు భాషలో కథా గానం చేయడమే వీరి ప్రధాన వృత్తిగా కలిగి వారివల్ల ధనం పొందుతారు. అంతేగాక తోటి స్త్రీలు గోండు, కోలామీ, ప్రధాన్, నాయకపోడు మొదలైన గిరిజన స్త్రీ లకు పచ్చబొట్లు వేసి ధనం స్వీకరిస్తారు. పచ్చబొట్లు వేయడంలో వీరు నేర్పరులు. పెదవేగి చెక్కను నీటిలో నానబెట్టి ఆముదం దీపం మసిని ఆ నీటిలో కలిపి పచ్చబొట్టు ద్రవాన్ని తయారు చేస్తారు. దీన్ని వివిధ ఆకారాలలో చర్మంపై పచ్చబొట్టుగా వేస్తారు. ఈ పచ్చబొట్టు సంస్కృతికి ప్రతీకగా (చిహ్నంగా), అలంకరణగాను, వ్యాధులను నివారించేదిగాను ఉపయోగపడుతుందని గిరిజనులు నమ్ముతారు. కొందరు తోటిలు వ్యవసాయం చేస్తున్నారు. కొందరు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. కొందరు తోటీలు పాటలు పాడి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ విధంగా తోటీలు కుటుంబంలోని వారంతా కష్టపడి సంపాదించుకొని తమ జీవనాన్ని సాగిస్తారు. 

న్యాయ వ్యవస్థ..

ప్రతి తోటి గ్రామంలోని గ్రామ పంచాయతీ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. గ్రామ పంచాయతీలో పటేల్, మహాజన్, దేవరి ఘటియాల్, హవల్దాల్ అనేవారు సభ్యులుగా ఉంటారు. పటేల్ పంచాయతీలో కుల పెద్ద. ఇతడే న్యాయనిర్ణయాన్ని చేస్తాడు. మహాజన్ మతాధికారి, దేవరి పూజారి, ఘటియాల్ కుల పెద్దకు సహాయకారి, హవల్దాల్ వార్తావాహకుడు. వీరు అందరూ కలిసి గ్రామంలోని ఏ రకమైన సమస్య వచ్చినా గ్రామపంచాయతీ లోనే పరిష్కరిస్తారు.

మత విశ్వాసాలు..

తోటీలు ప్రకృతి దేవతలను ఎక్కువగా పూజిస్తారు. పంటలు వేసేటప్పుడు, పంటలు కోతకు వచ్చినప్పుడు భూదేవిని పూజిస్తారు. వీరు పుట్ట చెట్టురాయి వంటి వాటిని దేవతా ప్రతిమలుగా పూజిస్తారు. రెండు మూడు రాళ్లు పెట్టి ముగ్గువేసి పంచపాండవులుగా పూజిస్తారు. వీటితోపాటు వారి గోత్ర చిహ్నాలు కూడా పూజిస్తారు. శ్రావణ మాసంలో జల్లిదేవరను పూజిస్తారు. శివుని రూపంగా కొత్త కుండను, తొలకరి వర్షాలు పడినప్పుడు ’అకిపేన్‘ దేవతను వేపచెట్టు రూపంలోనూ, ’పెర్సాపేస్‘ అనే దేవుని పుట్ట రూపంలోనూ పూజిస్తారు. మెస్రం వంశస్థులు నాగోబాను విశేషంగా పూజిస్తారు. 

ఆచార వ్యవహారాలు..

జననం: 

తోటి స్త్రీలు ఇంటి దగ్గరే మంత్రసానులతో ప్రసవం చేయించుకుంటారు. ప్రసవం అయిన తర్వాత అయిదవ రోజున బాలింతను, బిడ్డను బావి దగ్గరకి తీసుకొని పోతారు. ఆ సమయంలో వారు ఇంటి నుంచి బావికి చేరుకునే దారిపొడవునా కొన్ని జొన్నలను, పప్పు ధాన్యాలను చల్లుకుంటూ పోతారు. బాలింతచేత బావి దగ్గర పూజ చేయించి, తర్వాత బావి నీటిని తెచ్చి ఇంటి దగ్గర స్నానం చేయిస్తారు. 

వివాహం..

తోటిలలో మేనరికం పెళ్లి సంబంధాలు ఎక్కువగా జరుగుతాయి. కట్నాలు వీరికి లేవు. పెళ్లి అబ్బాయి ఇంట్లోనే జరుగుతుంది. ఎడ్లబండి మీద వధువుని తీసుకుని వరుని ఇంటికి పోతారు. అబ్బాయి అన్న వదినలు అమ్మాయి కాళ్లు కడుగుతారు. తర్వాత పెళ్లి కూతురు వాళ్లకు ఉల్లి జావ ఇస్తారు. పెళ్లి కూతురుకు ఆమె సగాకు చెందిన వారి ఇంటిలో విడిది ఏర్పాటు చేస్తారు. రాత్రి పెళ్లి కొడుకు స్నానం చేసి తుడుచుకున్న వస్త్రాన్ని వధువుకు పంపిస్తారు. తర్వాత వరుని కాలికి కోడిని కడతారు. అతడు అప్పుడు నృత్యం చేస్తాడు. ఆ కోడిని పెళ్ళి కూతురు వదినకు ఇస్తారు. దీనివల్ల కోడి పిల్లలవలె వారి వంశం అభివృద్ధి చెందుతుందని నమ్మకం. పెళ్లి కొడుకు నల్లపూసలు తాళిబొట్టు కలిపి దండ తయారు చేస్తాడు. మర్నాడు గుడిలో తాళిబొట్టుతో కూడిన నల్లపూసల దండను వరుడు వధువు మెడలో వేస్తాడు. అనంతరం బంధుమిత్రులతో విందు వినోదాలతో వివాహం పూర్తి అవుతుంది. 

అంత్యక్రియలు..

తోటిలు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని దుప్పట్లో లేక, బొంతలో చుట్టి మంచం తిరగేసి దాని మీద పెట్టి స్మశానానికి తీసుకొని పోతారు. ఐదవ రోజు చనిపోయిన చోట బియ్యం వేసి కోడిని వదులుతారు. కోడి బియ్యం తింటే చనిపోయిన వ్యక్తి సంతృప్తి చెందినట్లుగా భావిస్తారు. దినకర్మ రోజున ఆడవాళ్లు ఇప్ప చెట్టు దగ్గర నత్యాలు చేస్తారు. శవాన్ని కాల్చిన చోట పురుషులు నత్యాలు చేస్తారు.

తోటీల సంస్కృతి..

తోటీలు ఊళ్లకు దగ్గరలోను, అటవీ ప్రాంతాల్లోను నివసిస్తున్నారు. వీరు వెదురు తడికలతో చతురస్రా కారంగా గుడిసెలను నిర్మాణం చేసుకొని, దానిపైన జొన్నచొప్పను కప్పుతారు. ఇంటి ముందు చతురస్రాకారంలో పందిరిని వేసుకుంటారు. 

ఆహారం..

తోటీలు ప్రధానంగా జొన్న మొక్కజొన్న ధాన్యాలతో జావ, సంకటి చేసుకుని తింటారు. వీరు మాంసాహారులు. వీరు చేపలు, కోళ్ల, గొర్రెల, మేకల, కుందేళ్ళ మాంసాన్ని తింటారు.

వస్త్రధారణ..

స్త్రీలు సాధారణంగా చీర, రవిక ధరిస్తారు. పురుషులు పంచె ధోవతిని ధరిస్తారు. 

ఆభరణలు..

తోటీలు చాలా పేదవారు. కాబట్టి వారికి గొప్పగా ఆభరణాలను ధరించే స్తోమత లేదు. వివాహిత స్త్రీలు గాజులను, చెవులకు చిన్న కమ్మలను, కాళ్లకు వెండి మెట్టెలను, మెడలో నల్లపూసల దండను ధరిస్తారు. 

సాంస్కృతిక పరమైన ప్రత్యేకతలు..

తోటీలు తమ గూడానికి వచ్చిన బంధువులను మిత్రులను డోలు, పెప్రె, కాలికోం వాద్యాలతో లోపలికి ఆహ్వానిస్తారు. కాళ్ళకు నీళ్ళిచ్చి, నుదుట బొట్టు పెట్టి, ”రామ్ రామ్‌“ అని ఆలింగనం చేసుకుంటారు. అదే విధంగా వెళ్లేటప్పుడు వివిధ వాద్యాలతో ఊరి చివర వరకు సాగనంపుతారు.  తోటీలు ఆనంద సమాయాల్లోనూ, విషాద సమయాల్లోనూ వారి భావాలను నృత్యరూపంలో వ్యక్తం చేస్తారు. దండారి, ధింసా, బుర్రి నృత్యాలు వివాహ సందర్భంలో చేస్తారు. సత్తి నృత్యం, జువారి నృత్యం పండుగ సందర్భాల్లో చేస్తారు.