20-09-2025 11:44:07 AM
హైదరాబాద్: దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాలకు కృష్ణా నది వరప్రదాయినని కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. ఆల్మట్టి డ్యామ్(Almatti Dam) పై కవిత శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆల్మట్టి హైట్ పెంచకుండా ఉమ్మడి ఏపీలో జీవో ఉందన్నారు. 5 మీటర్లు ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతుందని వివరించారు. దీంతో తెలంగాణకు కృష్ణా నది ఆనవాళ్లు లేకుండా పోతాయని వివరించారు. అలా జరిగితే క్రికెట్ ఆడటానికి తప్ప మన పొలాలు పనికి రాకుండా పోతాయని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
బనకచర్లపై కోర్టుకు వెళ్తామని ఆమె సూచించారు. ఆల్మట్టి డ్యాం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) స్పందించాలని డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చుక్క నీరు రాకుండా పోతుందని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్న కవిత సోనియా గాంధీతో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఫోన్ చేయించాలని కోరారు. కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచాలని నిర్ణయించినందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు దీనిని తెలంగాణ రైతులకు డెత్ వారెంట్ అని అభివర్ణించారు. తెలంగాణ రైతులపై ప్రమాదకరమైన కుట్ర జరుగుతుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.