10-01-2026 02:07:38 AM
ప్రముఖ భారతీయ చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలమ్స్ మరో ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకుంది. 2025లో విడుదలై ఘన విజయం సాధించిన ‘మహావతార్ నరసింహ’, ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. అయితే, తాజాగా ఈ రెండు సినిమాలు అధికారికంగా ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
తమ రెండు చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చేరడం భారతీయ చిత్రసీమకు గర్వకారణమని హోంబాలే ఫిలమ్స్ సోషల్‌మీడియా వేదికగా పేర్కొంది. తమ రెండు సినిమాలు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, రచన, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ వంటి ప్రధాన విభాగాల్లో అకాడమీ పరిశీల నకు అర్హత సాధించాయని పేర్కొంది.
ఆస్కార్‌కు రెండడుగుల దూరంలో ఉన్నామని తెలిపింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘కాంతారా: చాప్టర్ 1’, అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మహావతార్ నరసింహ’ (హోంబాలే ఫిలమ్స్ ప్రెజెంటేషన్) బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. ఇక ఈ రెండు సినిమాలతోపాటు ఈ ఏడాది ఆస్కార్‌కు భారత్ నుంచి ఐదు చిత్రాలు పోటీ పడనున్నాయి.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘తన్వీ ది గ్రేట్’, ‘సిస్టర్ మిడ్‌నైట్’ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఆస్కార్ కోసం పోటీ పడనున్న చిత్రాల తుది జాబితాను ఈ నెల 22న ప్రకటించనున్నట్టు అకాడమీ వెల్లడించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే మార్చి 15న లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు ఈ వేడుకలో పోటీ పడనున్నాయి.