calender_icon.png 10 January, 2026 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాసాబ్‌కు నిరాశ

10-01-2026 02:09:23 AM

ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా శుక్రవారం విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. మూలిగే నక్కపై  తాటికాయ పడ్డ చందంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులోనూ నిరాశ ఎదురైంది. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ గురువారం అర్దరాత్రి ఇచ్చిన మెమోను కోర్టు శుక్రవారం కొట్టేసింది.

నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ వేశారు. సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్స్‌కు అనుమతి విషయంలో మెమో జారీ చేసే అధికారం హోంశాఖ కార్యదర్శికి లేదన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అనుమతులను జిల్లాస్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ ధరల పెంపు మెమోను కొట్టేసింది. తెలివిగా మెమోలు ఎందుకిస్తున్నారంటూ కోర్టు ఈ సందర్భంగా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించినా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నిం చింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా? అంటూ తీవ్ర స్వరంలో ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేసింది.