కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలి

28-04-2024 02:05:02 AM

భద్రాద్రి కలెక్టర్‌ని ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలోకి ప్రతి ఏడాది వర్షాకాలం గోదావరి వరద పొంగి ప్రవహిం చడం వల్ల సుమారు 5 వేల మంది ముంపునకు గురై నిరాశ్రయులు అవుతున్నారు. దీంతో ఆ కాలనీవాసులు ప్రతి ఏడాది ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుం టున్నా ఫలితం దక్కలేదు. అయితే శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభు త్వం రూ.40 కోట్ల వ్యయంతో కరకట్ట పొడిగింపునకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ వచ్చిన రోజే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఎన్నికల కారణంగా కరకట్ట నిర్మాణ పనులు ఆగిపోయాయి.

దీంతో కాలనీవాసు లు తాజాగా ఈ విషయంపై మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి నిధులతో పాటు పాలనా పరమైన అన్ని అనుమతులు ఇప్పించారు. అయినా కాంట్రాక్టర్ కరకట్ట నిర్మించడంలో తీవ్రజాప్యం చేస్తున్నాడు. వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ కరకట్ట నిర్మాణం ఆదిలోనే ఉండటంతో సుభాష్ నగర్ కాలనీవాసులు శనివారం మరోసారి మంత్రి తుమ్మల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రి తుమ్మల వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలకు ఫోన్ చేసి కరకట్ట నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వర్షాకాలం నాటికి పూర్తి చేయించాలని ఆదేశించారు.