calender_icon.png 3 November, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కర్ర ప్యానెల్ విజయం

03-11-2025 03:28:47 AM

పనిచేయని వెలిచాల వ్యూహం

కరీంనగర్, నవంబర్ 2 (విజయ క్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకుకు జరిగిన ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ మెజార్టీ డైరెక్టర్ స్థానాలను దక్కించుకుంది. పోలింగ్ శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగగా లెక్కింపు ఆదివారం తెల్లవారు జాము వరకు కొనసాగింది. మూడు ప్యానెళ్ల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించగా మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ ప్యానెల నుండి 9 మంది డైరెక్టర్లుగా గెలుపొందారు. కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు పార్టీలకు అతీతంగా మద్దకు లభించడంతో ఆయన ప్యానల్ గెలుపు సులువయింది.

మాజీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ప్యానెల్ నుండి ఒక్కరు కూడా గెలుపొందలేదు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ ప్యానల్ నుండి ఇద్దరు మాత్రమే గెలుపొందారు. కర్ర రాజశేఖర్ ప్యానల్లో చైర్మన్ అభ్యర్థి కర్ర రాజశేఖర్ కు 1959 ఓట్లు, తాడ వీరారెడ్డికి 987 ఓట్లు, బాశెట్టి కిషన్ కు 1119, దేశ వేదాద్రికి 1245, బండి ప్రశాంత్ దీపక్ కు 1035, బొమ్మరాతి సాయికృష్ణకు 1292, సరిల్ల రతన్ రాజుకు 856, ముద్దసాని శ్వేతకు 1710, వరాల జ్యోతి2019 ఓట్లతో విజయం సాధించారు.

వెలిచాల రాజేందర్రావు నిర్మల భరోసా ప్యానల్ నుండి అనరాసు కుమార్ 1015, ఉయ్యాల ఆనందం 919 ఓట్లతో విజయం సాధించారు. వీరితోపాటు ప్యానల్ కు సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థి కన్న సాయి 1220 ఓట్లతో గెలిచారు. సోమవారం నూతన డైరెక్టర్లతో సహకార అధికారి సమావేశం నిర్వహించి మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు చైర్మన్ ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం కర్ర రాజశేఖర్ ప్యానెల్లో 9 మంది సభ్యులు డైరెక్టర్లుగా గెలుపొందగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది కన్న సాయి మద్దతు కూడా ఆయనకే ఉండడంతో చైర్మన్ గా కర్ర రాజశేఖర్ ఎంపిక లాంఛనం కానుంది.

వెలిచాల రాజేందర్రావు నిర్మల్ భరోసా పేరుతో ఏర్పాటు చేసిన ప్యానెల్ నుండి ఇద్దరు మాత్రమే గెలుపొందడంతో అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ఆయన రచించిన వ్యూహం పనిచేయలేదు. ప్యానెల్ అభ్యర్థులను తీసుకుని హైదరాబాద్ కు వెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసినా ఫలితం దక్కలేదు. మరోపక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికలకు ముందే పార్టీ ప్యానెల్ ఉండదని కాంగ్రెస్ అభ్యర్ధులే గెలుస్తారని ప్రకటించడంతో ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించడంతో కర్ర భారీ ఆధిక్యతతో గెలుపొందారు. ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా పనిచేశారు.

ఆయన కూడా కర్ర రాజశేఖర్ ప్యానెల్ కే మద్దతు పలకడమే కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కర్ర ప్యానెల్ కు మెజార్టీ స్థానాలు దక్కినట్లయింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు సన్నిహితుడైన కర్ర రాజశేఖర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా ప్రకటించుకుంటారా, స్వతంత్రంగాఉంటారాచూడాలి.