03-11-2025 09:31:53 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం(Chevella bus accident) ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.
ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయచర్యలో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కు గాయాలయ్యాయి. సీఐ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో గాయాలయ్యాయి. తక్షణమే అతన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు కండక్టర్ రాధ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో చిక్కుకున్నవారిని సిబ్బంది బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎదురుగా వచ్చిన కంకర లారీ ఆర్టీసీ బస్సుపైకి ఒరిగింది. దీంతో లారీలో ఉన్న కంకర బస్సులోని ప్రయాణికులపై పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు జేసీబీ యంత్రాలను ఉపయోగించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. బస్సులో పడిన కంకర కింద ప్రయాణికులు కూరుకుపోయారు. కంకరతో బస్సు నిండడంతో సహాయకచర్యలు అతికష్టంగా మారాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో అనేక కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.