03-11-2025 02:27:11 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
కుత్బుల్లాపూర్, నవంబర్ 2(విజయక్రాంతి): ప్రభుత్వ భూములను కబ్జా చేసిన బడా బాబులను రక్షిస్తున్న హైడ్రా, పేదల ఇళ్లపై మాత్రం ప్రతాపం చూపడం సిగ్గు చేట ని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల బృందం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామం సర్వే నంబర్ 307లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన కుటుంబ సభ్యుల పేరు మీద ఆక్రమించిన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని సందర్శించారు.
ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో పేదలకు, పెద్దలకు మధ్య హై డ్రా అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 307 సర్వే నంబర్‌లో పేదలకు చెందిన 270 ఇళ్లను కూల్చిన హైడ్రా అధికారులు అరికెపూడి గాంధీ 11 ఎకరాల స్థలానికి వేసిన బారికేడ్లను కూల్చిన వెంటనే తిరిగి మళ్లీ నిర్మిస్తే మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒకనీతి పెద్దలకు ఒక నీతి అన్నట్లుగా ఉందన్నారు. పెద్దల పాలిట రక్షకులు గా, పేదల పాలిట భక్షకులుగా హైడ్రా అధికారులు వ్యవహరిస్తు న్నారు.
బిఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీ కుటుంబానికి 1100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను పార్టీ మారినందుకు నజరానాగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల వ్యతిరేక నిర్ణయాలను గమనించాలని, ప్రభుత్వ భూము లను పెద్దలకు దోచి పెడుతున్న విధానాలను ఎండగట్టి ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, పార్టీ రాష్ట్ర నాయకులు మాజీమంత్రులు, శాసన సభ్యులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సునీత లక్ష్మారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సీనియర్ నాయకు లు పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.