calender_icon.png 3 November, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలు అదుర్స్

03-11-2025 02:25:08 AM

మహిళల వన్డే ప్రపంచకప్ కైవసం

  1. తొలిసారి వరల్డ్‌కప్ గెలిచిన భారత్
  2. ఫైనల్లో షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో
  3. ఒత్తిడికి చిత్తయిన సఫారీలు

అత్యధిక పరుగులు : వోల్వార్ట్ 571 

అత్యధిక వికెట్లు:  దీప్తి శర్మ 22  

అత్యధిక సిక్సర్లు : రిఛా ఘోష్ 12  

ముంబై, నవంబర్ 2 : దశాబ్దాల నిరీక్షణ ఫలించింది... మహిళల క్రికెట్‌లో వరల్డ్‌కప్ కోసం భారత్ సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది... సొంతగడ్డపై దుమ్మురేపిన మన అమ్మాయిలు వన్డే క్రికెట్‌లో రారాణులయ్యారు. రెండుసార్లు అందినట్టే అంది చేజారిన ప్రపంచకప్‌ను ఈ సారి భారత మహిళల జట్టు వదల్లేదు. టోర్నీని ఘనంగా ఆరంభించి , తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో వెనుకబడి..చివరికి డూ ఆర్ డై మ్యాచ్‌లో రెచ్చిపోయి సెమీస్‌కు దూసుకొచ్చింది.

సెమీస్‌లో కంగారూలకు చెక్ పెట్టిన మన అమ్మాయిలు ఇప్పుడు ఫైనల్లో సఫారీలను సఫా చేసి సగర్వంగా వరల్డ్‌కప్ అందుకున్నారు. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త సువర్ణాధ్యాయం మొదలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లేలో ధాటిగా ఆడడం..

తర్వాత సింగిల్స్ తీస్తూ స్కోర్ పెంచారు. హాఫ్ సెంచరీకి చేరువలో స్మృతి(45)ఔటైనప్పటకీ జెమీమాతో కలిసి షెఫాలీ వర్మ చెలరేగింది. 49 బంతుల్లో ఆమె హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. సెంచరీ చేస్తుందనుకున్న షెఫాలీ వర్మ(87) అనవసర షాట్‌తో ఔటైంది. తర్వాత హర్మన్ ప్రీత్‌కౌర్, అమన్‌జోత్ కౌర్ త్వరగానే ఔటవగా.. దీప్తి శర్మతో కలిసి రిఛా ఘోష్ ఇన్నింగ్స్ కొనసాగించింది. ఈ క్రమంలో దీప్తి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోగా, రిఛా దూకుడుగానే ఆడింది. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా 3 వికెట్లు పడగొట్టింది.

ఫైనల్లో 299 పరుగుల టార్గెట్ అంటే భారీస్కోరే... పైగా టైటిల్ పోరులో ఉండే ఒత్తిడి కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఆ ఒత్తిడితోనే సౌతాఫ్రికా ఆరంభంలో ఆచితూచి ఆడింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. కెప్టెన్ వోల్వార్ట్ తన ఫామ్ కొనసాగించగా..బ్రిట్స్ రనౌట్‌గా వెనుదిరిగింది. తర్వాత బోస్చ్(0)ను శ్రీచరణి డకౌట్‌గా పెవిలియన్‌కు పంపింది. ఇక షెఫాలీ వర్మ బంతినందుకుని తన మ్యాజిక్ చూపించింది. వరుస ఓవర్లలో సుల్ లూస్(25) , ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ మరిజాన్నె కాప్‌ను(4) ఔట్ చేసింది.

అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ వోల్వార్ట్ తర్వాత బ్యాటర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ముందుకు తీసుకెళ్ళింది. ఆమె ఇంగ్లాండ్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠగానే సాగింది. డెర్క్‌సన్ కూడా సపోర్ట్ చేయడంతో ఒకదశలో భారత్‌కు ఓటమి తప్పదేమో అనిపించింది.

కానీ దీప్తి శర్మ వరుస వికెట్లు తీసి మ్యాచ్‌ను ఇండియావైపు తిప్పేసింది. తర్వాతి బ్యాటర్లు ట్రియోన్(9), డిక్లార్క్ కూడా నిరాశపరిచారు. దీంతో ఒత్తిడికి చిత్తయిన సౌతాఫ్రికా మహిళల జట్టు పోరాడి ఓడింది. ఓవరాల్‌గా బౌలింగ్‌లో షెఫాలీ వర్మ, దీప్తిశర్మల మ్యాజిక్‌తో పాటు వోల్వార్ట్ ఇచ్చిన క్యాచ్‌ను దాదాపుగా వదిలేసిందనుకున్న అమన్‌జోత్ చాకచక్యంగా అందుకోవడం టర్నింగ్ పాయింట్స్‌గా చెప్పొచ్చు.

మొత్తం మీద సమిష్టిగా రాణించిన భారత మహిళల జట్టు సొంతగడ్డపై ప్రపంచకప్‌ను అందుకునిమురిసిపోయింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఈ విజయంతో తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్ మహిళల జట్టు రూ. 37.3 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందు కుంది. షెఫాలీ వర్మ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, దీప్తిశర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

భారత్ ఇన్నింగ్స్ : 298/7 (షెఫాలీ వర్మ 87, దీప్తి శర్మ 58, స్మృతి 45;  కాకా 3/58, లాబా 1/47)

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 246 ఆలౌట్  (లారా వోల్వార్ట్ 101,డెర్క్‌సన్ 35, లుస్ 25; దీప్తి శర్మ 5/39,  షెఫాలీ వర్మ 2/36)