calender_icon.png 3 November, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి అంచున కాంగ్రెస్

03-11-2025 02:16:57 AM

పార్టీలో భగ్గుమంటున్న అంతర్గత విభేదాలు

  1. మంత్రుల మధ్య తరచూ మనస్పర్థలు 
  2. సీఎం రేవంత్ నిర్ణయాలపై సీనియర్ల గుర్రు 
  3. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆరోపణలు 
  4. బీఆర్‌ఎస్ కార్యాలయాలపై పార్టీ శ్రేణుల దాడులు
  5. రెండేళ్లుగా లేనిది ఉన్నట్టుండి అజారుద్దీన్‌కు మంత్రి పదవి
  6. ముస్లిం ఓట్ల కోసమే మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు విమర్శలు 
  7. ఇవన్నీ.. జూబ్లీహిల్స్ ఉప ఉన్నికపై ప్రభావం చూపుతాయని విశ్లేషకుల అంచనా

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు.. సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు.. తన సన్నిహితులకే పదవులు కట్టబెడుతుండటం, పార్టీ వ్యవహారాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తుండటం.. బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం లోపాయికారి సహకరిస్తుందనే కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యానించడం.. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ముస్లింల ప్రాతినిధ్యం కల్పించకుండా సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే అజారుద్దీన్‌ను మంత్రి పదవి కట్టబెట్టడం.. బీఆర్‌ఎస్ కార్యాలయాలపై విచక్షణ లేకుండా దాడులు చేయ డం వంటివి కాంగ్రెస్‌కు చేటుచేస్తున్నాయి.

ఈ పరిణామాలన్నీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనస్ అవు తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు భరోసా ఇవ్వడంలో విఫలంకావడం, మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం వంటివి ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి కారణాలు కానున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఓటమి అంచున కాంగ్రెస్ పార్టీ ఉన్న ట్లు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తల్లో రోజురోజుకూ అసంతృప్తి, అసహనం పెరుగుతున్నది. ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన పెరుగుతున్నది.

ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు పదవి.. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యే గోపినాథ్ మరణం తర్వాత జరిగే ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అజారుద్దీన్‌కే అవకాశం కల్పిస్తుందని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, అధిష్ఠానం ఊహించని విధంగా అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరికీ చోటు లేకపోవడం, ముస్లింల తరఫునా ప్రాతినిధ్యం లేకపోవడంతో అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి.  ఈక్రమంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ ఆమోదం రాలేదు. మరోవైపు పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ప్రకటించింది.

కొద్దిరోజుల తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. నిన్నమొన్నటి వరకు అజారుద్దీన్‌ను పట్టించుకోని పార్టీ, ఉన్నట్టుండి మంత్రివర్గంలోకి తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌కు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమను కాదని అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడంపై పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. 

ఎంఐఎం మద్దతు ఉన్నట్టా? లేనట్టా?

ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని ముందు పార్టీ శ్రేణు లు భావించాయి. ఎంఐఎం బరిలో తన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండటం, ఎంఐఎం పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు భావించా యి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం మ ద్దతుపై సందిగ్ధం నెలకొన్నది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇటీవల ‘ఎంఐఎం లోపాయికారిగా బీఆర్‌ఎస్‌కు సహకరిస్తుంది’ అని వివా దాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కా రణంగా ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూరమవుతుందనే చర్చ మొదలైంది.

పార్టీ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి.. 

రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రస్తుతం అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. అసంతృప్త నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. నేతల మధ్య అడపాదడపా కొట్లాటలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇవి పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై కొందరు మంత్రులతోపాటు సీనియర్లలో అసంతృప్తి ఉన్నట్లు చర్చ నడుస్తున్నది. సీఎం సన్నిహితులకు అనుకూలమైన నిర్ణయాలు వస్తున్నాయని, తమకు ప్రాధాన్యం లేనట్లు వారు భావిస్తున్నట్లు సమాచారం.

డీసీసీ, కార్పొరేషన్ పోస్టులు, సలహాదారుల ఎంపికలో సీనియర్ నాయకుల అను చరులకు చోటు లేకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. సీంఎ నిర్ణయాలు తీసుకునే సమయంలో సీనియర్లతో చర్చలు జరపడం లేదని, ఇది పార్టీ సమైక్యతకు ప్రమాదమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు మంత్రుల మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. తాజా పరిణామాలను చూస్తే మంత్రివర్గంలోని ఏ ఇద్దరు మంత్రుల మధ్య సఖ్యత లేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.

అసహనంతోనే బీఆర్‌ఎస్ కార్యాలయాలపై దాడులు.. 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రాజకీయం మరింత రాజుకుంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు పరాకాష్ఠకు చేరాయి. ఈ క్రమంలో సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని బీఆర్‌ఎస్ కార్యాలయాలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ ఓటమి పాలవుతుందనే అసహనంతోనే వారు దాడులకు పాల్పడుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ కార్యాలయానికైతే ఏకంగా నిప్పు పెట్టే ప్రయత్నం జరిగింది. వరంగల్‌లోనైతే కాంగ్రెస్ శ్రేణులు బీఆర్‌ఎస్‌కు చెందిన ఫ్లెక్సీలు, కటౌట్లను చించివేశారు. ఖమ్మం నగరంలో బీఆర్‌ఎస్ నాయకుల వాహనాలను ధ్వంసం చేశాయి. 

‘హస్త’గత సమాప్తం

నియోజకవర్గంలో ప్రచార ఆరంభంలో బలంగా కనిపించిన కాంగ్రెస్ రాను రాను బలహీనమవుతున్నది. పార్టీ నేతల్లో అసంతృప్తి, ముస్లిం ఓట్ల విభజన, అంతర్గత విభేదాలు కలిసి పార్టీని కష్టాల కడలిలోకి నెడుతున్నాయి. గెలుపు ధీమా నుంచి ఇప్పుడు పార్టీకి ఓటమిపట్టుకుంది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్‌కు పార్టీ శ్రేణుల నుంచి మొదట్లో గట్టి మద్దతు కనిపించింది. తర్వాత తగ్గుతూ వచ్చింది. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 22శాతం మంది ఉంది. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్‌కి పడతాయన్న నమ్మకం పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్ నిబంధనలు, కొత్త కట్టడాలకు అనుమతులు జటిలంగా మారాయి. ఆ ప్రభావం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బిల్డర్లు, ప్రాపర్టీ డీలర్లపై పడింది. దీంతో వారంతా పార్టీకి ఎడంగా ఉంటూ, బీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ అంతర్గత విభేధాలు బూత్ స్థాయిలోనూ ప్రభావం చూపుతున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి బీఆర్‌ఎస్ విస్తృత ప్రచారం చేస్తున్నది. ముస్లిం మతపెద్దలతో మంతనాలు చేస్తున్నది.

గెలుపుకోసం ఉండే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలో అణువణువూ పర్యటిస్తున్నారు. ‘పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రగతి కావాలా.. రెండేళ్ల మోసం కావాలో తేల్చుకోవాలి’ అని ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, తమకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని నియోజకవర్గానికి చెందిన మెజార్టీ స్థానిక ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైనా నెరవేర్చలేదంటున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి అంచున ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.