26-10-2025 10:01:23 AM
మహిమాన్వితం "భీమలింగేశ్వరుడు"
శివయ్యకు గడియ గడియకు స్నానాలే
వలిగొండ,(విజయక్రాంతి): పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో ఈనెల 27 నుండి వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలోని త్రివేణి సంగమమైన శ్రీశ్రీశ్రీ గంగ గౌరీ సమేతమైన భీమ లింగేశ్వరుడి ఉత్సవాలు నిర్వహించనున్నారు. భీమ లింగం వద్ద గల భీమలింగేశ్వరుడిని చరిత్రలోకి తొంగి చూసినట్లయితే ముచుకుందా నది మూసి మధ్యలో శివయ్యకు ప్రతిరూపమైన భీమలింగాన్ని క్రీస్తు శకం 435-470 మధ్య ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన నాటి విష్ణుకుండీనీల వంశంలోని రెండవ మాధవ వర్మ ప్రతిష్టించినట్లు తామ్ర శాసనాలలో తెలుస్తుంది.
భీమ లింగాన్ని నది మధ్యలో ఏర్పాటు చేయడంతో నిత్యం లింగాన్ని అలలు తాకుతుండడంతో ఇది "శివయ్యకు గడియ గడియకు స్నానాలే" అన్నట్లుగా కనిపిస్తుంది. మాన్వితమైన భీమలింగేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 27న రుద్రాభిషేకాన్ని, వచ్చేనెల 3న గణపతి, నవగ్రహ పూజలను, రుద్రహోమాన్ని, 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష బిల్వార్చన,10న కుంభాభిషేకం, 17న శ్రీశ్రీశ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం, 20న శాంతి ఆశీర్వచనం నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ నిర్వాహకులు తెలియజేశారు.