calender_icon.png 29 August, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరుణ రసాత్మక మహాకవి

04-08-2024 12:00:00 AM

నేడు ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి జయంతి :

ఇరవైవ శతాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు మహా కవుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ఒకరు. ఆయన కవిత్వంలో ఎక్కువగా కరుణ రసం ఉండడంతో ‘కరుణశ్రీ’గా ప్రసిద్ధి చెందారు. అత్యద్భుతమైన కవితాత్మక సృజనతో ఆయన తెలుగు ప్రజల హృదయాలల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పాపయ్యశాస్త్రి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు వద్ద ఉన్న కొమ్మూరు గ్రామంలో పరదేశయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు 1912 ఆగస్టు 4న జన్మించారు. ప్రాథమిక విద్య కొమ్మూరులో అభ్యసించారు. తెలుగు, హిందీ భాషల్లో భాషాప్రవీణ తదితర పరీక్షల్లో ఉతీర్ణులయ్యారు. సంస్కృత భాషలోను గొప్ప పట్టు సాధించారు. వీరి కవిత్వం సులభశైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారంతో, వినసొంపుగా ఉం టుంది. నేటికీ వీరి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి. సమాజంలో ఆర్తుల దుఃఖాన్ని గమనించి, కార ణాలు వెతికి, పరిష్కారం మార్గాలను అన్వేషించారు. మనసులలో ఉత్తమ మార్పు నకు, సమాజంలో శాంతికి, నైతిక విలువల పెంపునకు ఆయన రచనలు, కవిత్వం ఎందరికో, ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి. 

చదువు అనంతరం అమరావతి రామకృష్ణ విద్యాపీఠంలో, గుంటూరు స్టాల్ బాలికల హైస్కూల్‌లో ఉపాధ్యాయులుగా, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. ‘పుష్ప విలాపం’, ‘కుంతీకుమారి’, ‘ఉదయశ్రీ’, ‘విజయశ్రీ’, ‘కరుణశ్రీ’, ‘కళ్యాణ కాదంబరి’, ‘ఉమర్ ఖయ్యాం’, ‘అరుణ కిరణాలు’, ‘అనురాగ లహరి’ వంటి రచనలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన మహాకవిగా వారు గుర్తింపు పొందారు. బాణభట్టుడు సంస్కృతంలో రాసిన ‘కాదంబరి’ వచన కావ్యాన్ని కరుణశ్రీ తన పద్య లాలిత్యం ద్వారా సులభశైలిలో తెలుగులోకి అనువదించారు. మృదు మధురమైన పద్య రచనాశైలి వీరి ప్రత్యేకత. వీరు రాసిన ‘పుష్ప విలాపం’ గాన గంధర్వుడు ఘంటసాల గానం చేశారు. ఆ రికార్డుల రూపంలో తెలుగునాట అందరి హృదయాల్లో కరుణశ్రీ రచనా శైలి, ఆర్ద్రత హత్తుకుని పోయాయి. 

ఆ విలాపాన్ని మరువగలమా?

‘నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన..’ అన్న ‘పుష్ప విలాపం’లోని పద్యాన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ‘పుష్ప విలాపం’, ‘కుంతీకుమారి’, ‘ఆనందలహరి’ కావ్యాలను డా॥ అమరేంద్ర ఆంగ్లంలోకి, డాక్టర్ సూర్య నారాయణ హిందీలోకి అనువదించారు. తెలుగు అకాడమీ పురస్కారం, రసమయి పురస్కారం, ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం, నాటి  రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ చేతుల మీదుగా సన్మానం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుండి అభినందన సత్కారం ఇలా అనేక అవార్డులను కరుణశ్రీ అందుకున్నారు. ‘సుభాషిణి’ పత్రికకు సంపాద కత్వం వహించారు. ఇటువంటి మహాకవి 1992 జూన్ 21న ఈ ప్రపంచాన్ని వీడినా, వీరి కవితాఝరి సదా తెలుగు ప్రజల మన్ననలు పొందుతూనే ఉంటుంది.

 ఐ. ప్రసాదరావు