04-08-2024 12:00:00 AM
తెలంగాణలో కాకతీయ రాజులు పాకాల, లక్కవరం లాంటి చెరువులు నిర్మించి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. వీటితోపాటు ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు వేయిస్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ళు లాంటివి నిర్మించారు. వీటితోపాటు నేటి ప్రజలకు తెలియనివి, నిరక్ష్యానికి గురైన గుళ్ళు ఎన్నో ఉన్నాయి. చరిత్రను పరిశీలిస్తే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి ఇద్దరు చెలెళ్లు పెద్ద ముపాంబిక, చిన ముపాంబిక ఉండేవారు. వారి పేర్లతో ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో పెద్ద ముప్పారం, చిన ముప్పారం గ్రామాలు వెలిశాయి.
చిన్న ముపాంబిక చెన్నకేశవ భక్తురాలు. దాదాపు 700 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజాచార్యులు స్థాపించిన శ్రీవైష్ణవ మతవ్యాప్తికోసం తమిళనాడులోని దివ్యక్షేత్రాలు శ్రీరంగం, కాంచీపురం నుంచి ఆళ్వారుల సంతతికి చెందినవారు తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. ఇక్కడి ప్రజలకు వైష్ణవ మత విశిష్టత గురించి తెలియజేశారు. వైష్ణవ గురువులు శ్రీ కురత్తాళ్వార్‌కు పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్ అనే ఇద్దరు కుమారులు. వేదవ్యాస భట్టర్ వంశస్థులు ప్రస్తుత ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి అగ్రహారం గ్రామంలో నివాసం ఉండి జిల్లాలోని చుట్టుపక్కల ప్రజలకు వైష్ణవతత్వం బోధిస్తూ మంత్రోపదేశం చేశారు. వారివద్ద శిష్యరికం చేసిన కొంతమంది భక్తులు గురుదక్షిణ రూపేణా భూదానం చేశారు.
ముప్పారంలోనే వెలసిన వెంకన్న
దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం వేదవ్యాస భట్టర్ శ్రీరంగం నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి, కురత్తాళ్వార్ విగ్రహాలను ఎడ్లబండ్ల ద్వారా తరలించి కోమటిపల్లి అగ్రహారం గ్రామంలో దేవాలయం నిర్మించాలని ప్రయత్నించారు. కానీ, విగ్రహాల తరలింపులో భాగంగా చిన్న ముప్పారం అగ్రహారం సరిహద్దులకు చేరగానే అక్కడినుంచి బండ్లు ముందుకు కదలక మొరాయించాయి. దీంతో వేదవ్యాస భట్టర్ గురువులు చిన ముప్పారం అగ్రహారం గ్రామంలోనే వేంకటేశ్వరస్వామి, ఆండాళ్‌దేవి, శ్రీకురత్తాళ్వార్, ఆళ్వార్ల విగ్రహాలతో దేవాలయం నిర్మించారు. వేదవ్యాస భట్టర్ అగ్రహారీకులు దేవతార్చన, సేవల నిమిత్తం దాదాపు యాభై ఎకరాల భూమి దేవాలయం పేరుపై రాసిచ్చారు. కురత్తాళ్వార్ విగ్రహం దేశంలో కేవలం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురంలో ఉన్నాయని ప్రపంచానికి తెలుసు. కానీ, తెలంగాణలో చిన ముప్పారం అగ్రహారంలోనూ కురత్తాళ్వార్ విగ్రహం ఉండటంతో ఇది గొప్ప ప్రాధ్యానత సంతరించుకుంది.
పునర్నిర్మాణానికి పూనుకోవాలి
ఈ దేవాలయం ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడికి గురైందని స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారం. ఇంతటి ప్రాముఖ్యతగల దేవాల యానికి అగ్రహారీకులు రాసిచ్చిన భూములు అన్యాక్రాంతం కావడంతో ఎటువంటి ఆదరణ లేక ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. దేవాదాయ శాఖవారి నుంచి ప్రతినెల ధూప, దీప నైవేద్యాలకు మాత్రమే నగదు వస్తుంది. ఈ దేవాలయ స్థితిని చూసి స్థానిక చిన ముప్పారం గ్రామవాసి రావుల రామిరెడ్డి, ఇతర గ్రామస్తులు దేవాలయాభి వృద్ది కోసం దాదాపు 10 లక్షల రూపాయలు జాతీయ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు గతేడాది అక్టోబర్‌లో దేవాదాయ శాఖవారు 40 లక్షల రూపాయలు, భక్తుల 10 లక్షల రూపాయలతో దేవాలయం పునర్నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్మాణంలో నూతన రాజగోపురం, అధ్యయన మండపం, కళ్యాణ మండపం ఉన్నాయి. ఉత్తర్వులు జారీ చేసి ఎనిమిది నెలలు గడిచినా ఇంతవరకు టెండర్లు పిలవక, కాంట్రాక్టర్లను నియమించకపోవడంతో ఆలయ నిర్మాణం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ప్రస్తుత దేవాదాయ శాఖ అధికారులు వెంటనే గత ప్రభుత్వ ఉత్తర్వులను అమలు పరుస్తూ టెండర్లు దేవాలయం పునర్నిర్మాణం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఆళవందార్ వేణుమాధవ్