04-08-2024 12:00:00 AM
పోటీ ప్రపంచంలో తెలంగాణ యువతను ప్రపంచస్థాయిలో ఉద్యోగాలకు సిద్ధం చేసే దిశగా తొలి అడుగు పడింది. నగర శివార్లలోని ముచ్చెర్లలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’కి ఈనెల 1న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడంతో ఈ దిశగా కార్యాచరణ మొదలైంది. యువత నైపుణ్యాన్ని పెంపొందించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పలు కోర్సుల్లో శిక్షణ ఇచ్చే ఈ అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన జరిగిన మరుసటి రోజే శాసనసభలో దీనికి సంబంధించిన బిల్లునూ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.
బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరంలో ‘యంగ్ ఇండియా’ పత్రికను ప్రారంభించిన మహాత్మాగాంధీ స్ఫూర్తితో తమ ప్రభు త్వం దీనికి ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’గా నామకరణం చేసిందని చెప్పారు. ప్రతిపాదిత వర్సిటీపై తాము విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, విద్యార్థులతో అనేక దఫాలు చర్చలు జరిపామని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడంపై వర్సిటీ దృష్టి సారిస్తుందని తెలిపారు. 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నెలకొల్పబోయే ఈ విశ్వవిద్యాలయం హెల్త్‌కేర్‌సహా వివిధ విభాగాల్లో 15కు పైగా కోర్సులను అందిస్తుంది. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్, టూరిజం, హాస్పిటాలిటీ, నిర్మా ణం, ఇంటీరియర్ డిజైన్, అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్, మీడియా గేమ్స్, ఫిల్మ్స్ .. ఇలా అనేక కోర్సుల్లో ఇక్కడ శిక్షణ లభిస్తుంది. ఇవన్నీకూడా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. తద్వారా నైపుణ్య విశ్వవిద్యాలయం నుంచి బైటికి వచ్చే యువ త ఉద్యోగానికి సిద్ధంగా ఉంటారు.
ఏటా ఇంజినీరింగ్ చదివి కాలేజిల నుంచి బైటికి వస్తున్న లక్షలాదిమంది యువతీ యువకులు తమ చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరక్క, ఇటు చిన్నాచితకా ఉద్యోగాలు చేయలేక ‘రెంటికి చెడ్డ రేవడి’లా తయారవుతున్నారు. లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న చాలా కాలేజీలు విద్యార్థులకు సరైన నైపుణ్యాలను అందించడం లేదు. అందుకే, ఒకప్పుడు సీటు దొరకడమే గగనమైన పలు కాలేజీల్లో ఇప్పుడు పూర్తిగా భర్తీ కావడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఓ రకమైన నైరాశ్యం అలముకుంటున్నది. అందుకే, పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన యువతను తయారుచేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టడం కచ్చితంగా వారి భవిష్యత్తుకు మేలు చేసే చర్య. రాబోయే రోజుల్లో కృత్రిమమేధ లాంటి నైపుణ్యాలే అన్ని రంగాలను ఏలనున్న తరుణంలో ఇలాంటి కోర్సుల్లో నైపుణ్యం సాధించిన వారికి ఉద్యో గావకాశాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది.
ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే తొలి అడుగు వేయడం రేవంత్ ప్రభుత్వం ముందు చూపునకు నిదర్శనం. మన రాష్ట్రమేకాదు పొరుగు రాష్ట్రాలూ ఈ దిశగానే ఆలోచిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ‘నైపుణ్య గణన’ (స్కిల్ సెన్సస్) చేపడతామని ఎన్నికల సందర్భంగా చెప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఈ దిశగా చర్యలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని యువతలో ఎందరు ఏ రంగంలో నైపుణ్యం కలిగిఉన్నారో తెలుసుకోవడమే ఈ నైపుణ్య గణన ముఖ్యోద్దేశం. తద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి వీలుంటుంది. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్కిల్ వర్సిటీ ఉద్దేశమూ ఇదే. ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఇలాంటి నైపుణ్య శిక్షణ ఇచ్చే కొత్త కోర్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. తద్వారా యువతలో తమ భవిష్యత్తుపట్ల భరోసా కల్పించవచ్చు.