14-07-2025 02:41:44 AM
మేడ్చల్, జూలై 13 (విజయక్రాంతి)/ మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం దాడి చేశారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ చర్యకు పూనుకున్నారు. జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో మల్లన్న కార్యాలయంలోని మూడో గదిలో ఉన్నారు. ఆయనకు ఒక గన్ మెన్, సిబ్బంది రక్షణగా ఉన్నారు. మల్లన్న లోపల ఉన్న విషయం తెలుసుకొని జాగృతి కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా గన్ మెన్, సిబ్బంది అడ్డుకోగా వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గన్‌మెన్ 5 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో ఆందోళనకారులు మెత్తబడ్డారు.
తీన్మార్ మల్లన్న కు సైతం చేతికి స్వల్ప గాయమైంది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. దాడిలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్‌తో పాటు, కవిత బంధువు హస్తం ఉందని అనుమానిస్తున్నారు. తన కార్యాలయంపై దాడి ఘటనపై తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ము మ్మరం చేశారు.
సీసీ కెమెరాల పుటేజి పరిశీలించారు. ఏసీపీ, తీన్మార్ మల్లన్న స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కాగా దాడికి పాల్పడిన వారిలో ఇద్దర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. జహీరాబాద్‌లో శనివారం జరిగిన బీసీ సదస్సులో ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడుతూ..
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే కవిత రంగు పూసుకోవడం ఏమిటన్నారు. దీనితో కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. మీకు మాకు ఏం సంబంధం? కంచం లో పొత్తు ఉందా? మంచంలో పొత్తు ఉందా? అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జాగృతి నేతలు కార్యాలయంపై దాడికి పాల్పడట్టు తెలుస్తోంది.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
కవితపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మల్లన్న స్పష్టం చేశారు. కంచం, మం చం అనేది తెలంగాణలో ఊత పదాలని, ఇం దులో తప్పేముందని ప్రశ్నించారు. రౌడీలలా గా మాపై దాడి చేయడమే కాకుండా మళ్లీ మా మీదే కేసులు పెట్టారని, భయపడేది లేదని పే ర్కొన్నారు.
నా ఆఫీసులో రక్తం కళ్ల చూశారని, రక్తం మరకలతో ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చే శారు. తమ సిబ్బందిపై దాడి చేయడం కాకుం డా, కార్యాలయానికి వచ్చిన ప్రజలపై కూడా దాడి చేశారన్నారు. కవిత బంధువు సుజిత్‌రావు నా గదిలోకి వచ్చి గన్‌మెన్ తుపాకీ లా క్కొని ఫైర్ చేయడానికి ప్రయత్నించాడన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందిం చాలన్నారు.
ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసుల నమోదు
క్యూ న్యూస్‌పై దాడి ఘటనలో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామని మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపారు. కవిత అనుచరులు తమ కార్యాలయంలో విధ్వంసం సృష్టించడమే గాక, తనపై హత్యాయత్నం చేశారని మల్లన్న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని.. లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై వివరణ అడగడానికి క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లగా తమపై మారణాయుధాలతో దాడి చేశారని ఫిర్యాదు చేశారని తెలిపారు.