14-07-2025 12:44:06 PM
హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(BC Welfare Minister Ponnam Prabhakar Goud) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చర్యలు చేపట్టామని తెలిపారు. కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని కుల గణన కూడా నిర్వహించామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ(Bharatiya Janata Party) నేతలు వ్యతిరేకిస్తున్నారా..?, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదు? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత బీజేపీ, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేతలపై ఉందని తెలిపారు. రాష్ట్రపతితో ఆమోదింపజేసి.. 9వ షెడ్యూల్ లో చేర్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ.. ఒక బీసీ నేతను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి ఇచ్చిందని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్గం లేదా అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.
బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బీసీ నేతలు వాళ్ల అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని పొన్నం పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకే ఆర్డినెన్సు తెస్తున్నామని వెల్లడించారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కుల గణన చూపిన తర్వాతే కేంద్రం కళ్లు తెరిచిందని చెప్పిన మంత్రి పొన్నం(Minister Ponnam Prabhakar) తెలంగాణ తెచ్చిన ఒత్తిడితోనే కేంద్రం జనగణనతో పాటు కుల గణన చేస్తామని ప్రకటించిందన్నారు. బీసీ నేతలు.. పార్టీ పదవుల కోసం బీసీ రిజర్వేషన్లను తాకట్టుపెట్టొద్దని కోరారు. బీజేపీలోని కేంద్రమంత్రులు, ఎంపీలు బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేత లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నారు.. బీజేపీ చేయలేని పని కాంగ్రెస్ చేస్తోందని అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఎత్తివేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.