02-01-2026 03:50:08 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ని ఉగ్రవాది కసబ్‌తో పోల్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గురించి ఇలాంటి నీచమైన, బాధ్యతారహిత వ్యాఖ్యలు వినిపించినప్పుడు, కేసీఆర్ కుమార్తెగా నా రక్తం ఉడుకుతుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి మీడియా పాయింట్‌లో కవిత మాట్లాడుతూ.. తన రాజీనామా ఆమోదం కోరేందుకు శాసన మండలికి వచ్చినట్లు ఆమె తెలిపారు. కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ రెడ్డి అనడం సరికాదని, రేవంత్ ని ఒక్కసారి కాదు.. రెండుసార్లు ఉరలేయాలని మండిపడరు.
కృష్ణా జలాలపై తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలని, బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కవిత డిమాండ్ చేశారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దని, బీఆర్ఎస్ లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత ఎద్దేవా చేశారు. శాసనమండలి ఆవరణలో కల్వకుంట్ల కవిత ఇష్టాగోష్టి నిర్వహించారు. ఆర్థికశాఖలో ఒక్క ఫైల్ 9 నెలలుగా పెండింగ్ లో ఉందని, ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పై నిందలు వేస్తుందని ఆమె మండిపడ్డారు. ఏపీ నాయకులు శాశ్వతంగా తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని, ఆంధ్ర నేతలకు ఉన్న ఐక్యత తెలంగానలో లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, జీహెచ్ఎంసీలో డీలిమిటేషన్ సరిగ్గా జరగలేదని కవిత వ్యంగ్యంగా మాట్లాడారు.