02-01-2026 04:28:39 PM
- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని వేమనపల్లి మండలం నీల్వాయిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులు, వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ, విద్యార్థులకు వేరు వేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు.
- గిరిజన ఆశ్రమ పాఠశాల విజిట్...
మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి వంటశాల, భోజనశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆహారం నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలనికోరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో కుమారస్వామి, అధికారులు ఉన్నారు.