గజ్వేల్‌లో కవిత పర్యటన
గజ్వేల్ ఏప్రిల్ 8: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలి కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తెలంగాణ జాగృతి స్టేట్ సోషల్ మీడియా సభ్యుడు సుదర్శన్ గౌడ్ సతీమణి నందిని ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో వారిని పరామర్శించేందుకు కవిత నేరుగా వారి నివాసానికి చేరుకున్నారు. నందిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తరువాత మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక కొత్త రాజకీయ శక్తిగా అవతరించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేవలం అధికార లక్ష్యంతో కాకుండా, సామాజిక తెలంగాణ సాధనకే తమ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.
సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా తమ పార్టీ కార్యాచరణ కొనసాగుతుందని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఆయా పార్టీలో చురుకుగా పనిచేసి నిరాదరణకు గురైన ప్రజాసేవలో ముందుండే ప్రతి ఒక్కరికి తమ పార్టీ స్వాగతం పలుకుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక జాగృతి నాయకులు, సుదర్శన్ గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.




