calender_icon.png 22 November, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి లూటీ చేశారు కేసీఆర్ కుటుంబం..

22-11-2025 08:30:46 PM

- గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీరుస్తూనే  మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం

- మహిళల ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం నిలబడేలా ఇందిరమ్మ చీరలు

- కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయడమే ఈ ప్రజా ప్రభుత్వం లక్ష్యం

- ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వరాష్ట్రక్కలను నెరవేర్చిన సందర్భంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ లూటీ చేశారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.

మహిళల ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం నిలబడేలా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయడమే ఈ ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీరుస్తూనే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంది అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. మహిళలకు ఇచ్చిన మాట తప్పారని కేటీఆర్ హరీష్ రావు అంటున్నారని, మాట తప్పడానికి కారణం ఎవరు ఈ రాష్ట్రం అప్పుల పాలవడానికి కారణం ఎవరు మొదట మీరు చెప్పండని ప్రశ్నించారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలకు నేడు మేము అనుభవిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర మొత్తం మీద చిన్నచిన్న కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన బిల్లుల అప్పులు 40 వేల కోట్లని, వీళ్ళు చేసిన అప్పులకు ప్రస్తుతం కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ బిఆర్ఎస్ వాళ్ళు చేసిన లూటి, మోసాలు, అవినీతి అధికార దుర్వినియోగం నేడు మనం బాధపడుతున్నప్పటికీ మహిళలు ఎవరు అధైర్యపడవద్దన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని గతంలో ఉన్న ప్రభుత్వం వంద రూపాయల చీరలు ఇచ్చిందని ఇప్పుడు మహిళలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని సంతోషంగా ఉండాలని ఎనిమిది వందల రూపాయల విలువ గల చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు.

మద్యం నియంత్రణపై మహిళల హర్షం

2014 నుండి బెల్ట్ షాపులు గ్రామాలలో విచ్చలవిడిగా తయారయ్యాయని దానికి కారణం కేసీఆర్ అని అన్నారు. మద్యపాన నిషేధానికి నిన్ను వ్యతిరేకం కాదని, కానీ పొద్దంతా మద్యం తాగే విధానానికి వ్యతిరేకం అని మరోసారి స్పష్టం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పొద్దంతా పనిచేసుకొని సాయంత్రం పూట కొద్దిగా తాగాలే కానీ విచ్చలవిడిగా తాగొద్దని సూచించారు. ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, కుటుంబం ఆరోగ్యం ఉన్నప్పుడే చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపారం విషయంలో రాణిస్తారని అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం నియంత్రణపై మహిళలు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో యుగంధర్ రెడ్డి, ఇంచార్జ్ ఎమ్మార్వో నేలపట్ల నరేష్, మహిళా సంఘాల గ్రూపు లీడర్లు ఉన్నారు.