కేసీఆర్ వెంటే ఎన్నారైలు
బస్సుయాత్రతో పార్టీకి పూర్వవైభవం
బీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ చీఫ్ మహేశ్ బిగాల
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ఎన్నారైలు ఉన్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడుతూ.. కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌పై విష ప్రచారం మొదలు పెట్టారని, కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టిన తరువాత కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో వణుకుపుట్టిందని చెప్పారు. దీంతో ఆ పార్టీ అగ్రనాయకులు తెలంగాణలో విస్తృత ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుందని, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, బస్సుయాత్రతో బీఆర్‌ఎస్‌కు పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో సంకీర్ణ సర్కార్ వస్తుందని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 8 నుంచి 12 సీట్లు గెలుస్తుందని, కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. అనంతరం అనిల్ ప్రసంగిస్తూ తమ పార్టీ గెలుపు కోసం ఎన్నారైలు పనిచేస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిదన్నారు.




