13 April, 2026 | 12:22 AM

ఖర్చుకు తగ్గేదే లే

09-05-2024 01:21 AM

ప్రచారం కోసం పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు

హెలికాప్టర్ల కోసమే రోజూ 30 లక్షలు ఖర్చు

జన సమీకరణ, బహిరంగ సభల భారం అదనం

విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్న అభ్యర్థులు

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఖర్చుకు తగ్గేదే లే అంటున్నాయి. అభ్యర్థులు ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. గత ఎంపీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి ఖర్చు ఎందుకు డబుల్ అయింది? ఈ జాబితాలో ఏ పార్టీ టాప్‌లో ఉంది? ఎన్నికల ఖర్చు విషయంంలో సౌత్ ఇండియాలోనే తెలంగాణ టాప్‌లో ఉందనడంలో నిజమెంత? 

నేతల ఆకాశయానం

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడు పెంచాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఖర్చుకు వెనకాడకుండా దూసుకుపోతున్నాయి. అభ్యర్థులు పెడుతున్న ఖర్చును చూస్తుంటే.. వామ్మో అనాల్సిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు హెలికాప్టర్ల కోసమే రోజుకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయి. బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణ, జనసమీకరణ, హోర్డింగులు, సోషల్ మీడియాలో ప్రచారం వంటి వాటికి విపరీతంగా డబ్బు ధారపోస్తున్నాయి. ప్రచారానికి మరో మూడు రోజుల్లో తెరపడనున్న నేపథ్యంలో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జాతీయ, రాష్ట్రస్థాయి నేతల సుడిగాలి పర్యటనలు

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. మళ్లీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 14 ఎంపీ సీట్లు గెలువటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దక్షిణ భారతంలో కర్ణాటక తర్వాత బీజేపీ విస్తరించడానికి అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆ పార్టీ నమ్ముతోంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంపై కన్నేయొచ్చని నమ్ముతోంది. ప్రధాని మోదీ చెప్పినట్లు 400 స్థానాలను సాధించాలంటే.. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కీలక నేతలు పార్టీని వీడటంతో ఢీలా పడ్డ బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించకుంటే.. భవిష్యత్‌లో బీఆర్‌ఎస్ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలపు ప్రధాన పార్టీలకు చారిత్రక అవసరంగా మారింది. దీంతో ప్రజలను ఆకట్టుకొనేందుకు పార్టీలు తమ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించుతున్నాయి. బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే వంటి కీలక నాయకులు ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ తరఫున అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా పార్టీల నేతలు హెలికాప్టర్ల ద్వారా రోజులు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.

ఖర్చులో తెలంగాణ టాప్

ఎన్నికల ప్రచారానికి ఖర్చుచేసే విషయంలో దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రమే టాప్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ, జనసేన ఒకటి చొప్పున హెలికాప్టర్ ఉపయోగిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఏడు హెలికాప్టర్లను ప్రచారం కోసం వినియోగిస్తున్నట్లు ప్రైవేటు ఏవియేషన్ కంపెనీలు చెప్తున్నాయి. ఈ హెలికాప్టర్లను ముంబై, బెంగళూరుకు చెందిన ఏవియేషన్ కంపెనీల నుంచి అద్దెకు తీసుకొన్నారు. ప్రచారం కోసం మరో మూడు హెలికాప్టర్లు రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు తెలంగాణలోనే ప్రచారం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఈ నెలలోనే ప్రధాని మోదీ రెండుసార్లు తెలంగాణకు వచ్చారు. 10వ తేదీన మళ్లీ రానున్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఖర్గే ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ అయితే రోజుకు మూడునాలుగు సభల్లో పాల్గొంటున్నారు. దీంతో జాతీయ పార్టీలకు హెలికాప్టర్ల వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు, రోడ్ షోల కోసం జనసమీకరణకు భారీగా ఖర్చు చేస్తున్నారు. బుధవారం వేములవాడలో ఉదయం 9 గంటలకు బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతపొద్దున బహిరంగ సభ పెట్టినా.. ఆ పార్టీ వేలమందిని సమీకరించింది. జనసమీకరణపై రాజకీయ పార్టీలు ఎంతలా ఫోకస్ పెట్టాయనేదానికి ఈ సభే ఉదాహరణ. 

కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ

ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ల కోసం కాంగ్రెస్, బీజేపీ అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రస్తుతం తిరుగుతున్న ౭ హెలికాప్టర్లలో దాదాపు ఆరు కాంగ్రెస్, బీజేపీ అద్దెకు తీసుకొన్నవేనని సమాచారం. ఒక్కో హెలికాప్టర్‌కు గంటకు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు చెలిస్తున్నారు. ప్రచారానికి మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఇంకో మూడు హెలికాప్టర్లను ఆయా పార్టీలు ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఖర్చు మరింత పెరగనుంది.

2019లో నాలుగు హెలికాప్టర్లు 

2019 ఎంపీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పార్టీల ప్రచార ఖర్చు రెట్టింపు అయినట్టు సమాచారం. గతంలో హెలికాప్టర్ ఖర్చు గంటకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు రూ.7 లక్షల వరకు పెరిగింది. 2019లో ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో నాలుగు హెలికాప్టర్లను మాత్రమే వినియోగించారు. నాటి కంటే ఇప్పుడు బహిరంగ సభలు పెరిగాయి. దీంతో హెలికాప్టర్ల వినియోగం, ఇతర ఖర్చులు కూడా పెరిగాయి. అయితే గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికంగా ఖర్చు చేయగా.. ఈసారి కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఖర్చు పెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.