అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: వికాస్ రాజ్
వేతనంతో కూడిన సెలవుఇవ్వాలి
రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు
హైదరాబాద్: జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఎల్లుండి అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్న ఆయన నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతోందన్నారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదని ఆదేశించారు. రేపు, ఎల్లుండి దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంటే అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని పేర్కొన్నారు. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారు.. పోరుగు రాష్ట్రాల నుంచి కొందరు పోలీసులు కూడా వస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర బలగాలు కాకుండా 72 వేల పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. పోలింగ్ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నామన్నారు. దాదాపు 20 వేల బ్యాలెట్ యూనిట్లు స్పేర్ గా ఉంచుతామని స్పష్టం చేశారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొనున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్, 2,690 మంది హోమ్ ఓటు వినియోగించుకున్నారని వివరించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనిఖీలకు సంబంధించి 8 వేలకు పైగా కేసులు, డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2వేలకుపైగా కేసులు నమోదు చేశామని ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. సీ విజిల్, టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ సైట్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని వికాస్ రాజ్ ఆదేశించారు.






