25-07-2024 03:39:15 PM
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశంలో భాగంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ అంతా ఒట్టి డొల్ల అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజల ఆశలపై రాష్ట్ర బడ్జెట్ నీళ్లు జల్లిందని, ఈ ప్రభుత్వం ప్రజల గొంతు కోస్తూ, అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లు కేసీఆర్ ఆరోపించారు. రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారని, బడ్జెట్ లో దళితబంధు పథకం ప్రస్తావనే లేదని మండిపడ్డారు. దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారని, ఒత్తి పలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమి లేదన్నారు. ఈ అర్భక సర్కారు ఒక్క విధానం కూడా రూపొందించలేదని, కథ చెప్పారు తప్ప.. బడ్జెట్ పెట్టినట్లు అనిపించలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేదల కోసం ఒక్క విధానమైనా ప్రకటించారా?, బడ్జెట్ లో ఒక పద్దు.. పద్ధతి లేదన్నారు. బడ్జెట్ పై ప్రభుత్వాన్ని చీల్చీ చెండాడుతామని మాజీ సీఎం పేర్కొన్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని, భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరిగా లేదని, యాదవులు, మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని, నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఓ పాలసీ లేదని ఈ బడ్జెట్ లో అర్థమైందన్నారు.