25-07-2024 01:36:19 PM
హైదరాబాద్: రైతు కూలీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు రూ. 12 వేలు అందించే బృహత్తర కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామని వెల్లడించారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, ఫించన్లు చెల్లిస్తున్నాం, రాష్ట్ర అప్పులు తీర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సంక్షేమాన్ని విస్మరించలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 34,579 కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో నియామక ప్రణాళిక క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రైతు భరోసా సహా హామీలన్నీ త్వరలోనే అమలు చేసి తీరుతామని వ్యాఖ్యానించారు. బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదన్న భట్టి విక్రమార్క బడ్జెట్ అనేది విలువలు, ఆశల వ్యక్తీకరణ అన్నారు. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. అసమానతలు లేని సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నవారు. రైతులు చెల్లించాల్సి బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. రైతలకు పైసా ఖర్చ లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన వెల్లడించారు.