కేసీఆర్ దీక్ష ఒక చరిత్ర
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక చరిత్ర అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కానీ కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమ ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం రాకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఎక్కడిది, తెలంగాణ ప్రభు త్వం ఎక్కడిదని ప్రశ్నించారు.
కేసీఆర్ మీద అవాకులు, చెవాకులు పేలినంత మాత్రాన కేసీఆర్ చరిత్ర మారదని స్పష్టం చేశారు. ‘కొత్త బిచ్చగాళ్లు పొద్దు ఎరగరు’ అన్నట్టుగా కొంతమంది వ్యహరిస్తున్నారని విమర్శించారు. బతుకమ్మ పేరుతో ఆనాడు చీరలు పంచితే ప్రస్తుతం ఇందిరమ్మ చీరలుగా పేరు మార్చారని, పేరు మార్చడానికి పథకానికి కేసీఆర్ పేరు పెట్టుకోలేదని అన్నారు. రాష్ట్ర చరిత్ర తెలియని వారు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఇప్పుడు మాట్లాడుతున్న వారు తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని అసెంబ్లీలోనే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.




