calender_icon.png 1 September, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్బుద్ధితోనే కాళేశ్వరానికి కేసీఆర్ రీడిజైన్

01-09-2025 02:21:44 AM

  1. కేసీఆర్, హరీశ్‌ను శిక్షించాల్సి వస్తే ఉరితీయాలి
  2. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  3. బరాజ్‌లను డ్యాములుగా వాడినందుకే మేడిగడ్డ కుంగుబాటు
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  5. తప్పు చేయకపోతే కోర్టుకెందుకెళ్లారు
  6. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  7. కేసీఆర్ చెబితే హరీశ్ ఇంప్లిమెంట్
  8. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  9. ఘోష్ కమిషన్ ఓ చెత్త రిపోర్టు
  10. మాజీ మంత్రి హరీశ్‌రావు
  11. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో మాజీ సీఎం కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి మేడిగడ్డకు మార్చారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరో పించారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని కేసీఆర్, హరీశ్ ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని నియమించారని, ఆ కమిటీ నివేదిక వారికి అనుకూలంగా లేకపోవడంతో దానిని తొక్కిపెట్టి వాళ్లు అను కున్న చోట ప్రాజెక్టు కట్టారని స్పష్టం చేశారు.

ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడమే వారి లక్ష్యమన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డుచెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ కమిషన్ నివేదికపై ఆదివారం అసెంబ్లీలో చేపట్టిన స్వల్పకాలిక చర్చ సం దర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

అసంపూర్తి సమాచారంతో హరీశ్‌రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రాణహితచేవెళ్లలో నీరు అందుబాటులో ఉందని, హైడ్రాలజీ అనుమతులు ఇస్తున్నామని ఆనాటి కేంద్రమంత్రి ఉమాభారతి 24 తేదీన స్పష్టం గా చెప్పారని గుర్తు చేశారు. 205 టీఎంసీల నీరు అం దుబాటులో ఉందని లెటర్ రాస్తే.. వీళ్ల తప్పుడు విధానాలతో మరోసారి పరిశీలించాలని హరీశ్ మళ్లీ లేఖ రాశారని చెప్పారు.

ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్ తీసుకున్నాక మళ్లీ పరిశీలించాలని ఎవరైనా అడు గుతారా అని ప్రశ్నించారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చి న రిపోర్టులో వాస్తవాలని బయటపెట్టారనే వారిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్దారు.

హరీశ్ తప్పు చేశారని నివేదికలోని పేజీ నెంబర్ 98లో స్పష్టంగా పొందుపరిచారని వెల్లడించారు. కాళేశ్వరం నిర్మాణం లో కేసీఆర్, హరీశ్‌రావు చేసిన అవినీతిపై ప్రశంసించేందుకు సీబీఐ, సీబీ సీఐడీ, సిట్, ఏసీబీ.. ఏ విచారణ కావాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థలన్నింటినీ హరీశ్‌రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నా రు. హరీశ్‌రావు ఇప్పటికీ మంత్రిగా ఉన్నట్టుగానే భావిస్తున్నారని అన్నారు. 

పేరు మార్చి.. ఊరు మార్చి 

పేరు మార్చి ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని సీఎం విమర్శించారు. 2014లో నీరు అందుబాటు లో ఉందని చెప్పిన విషయం దాచి 13 మార్చి 2015 తేదీన ఉమాభారతి లేఖను పట్టుకుని హరీశ్ కప్పిపు చ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సాగునీటిరంగ నిపుణులు విద్యాసాగర్‌రావు బతికి ఉంటే వీళ్ల అబద్ధాలు వినలేక అదే కాళేశ్వరంలో దూకి ఆత్మహత్య చేసుకునేవారని అన్నారు.

మహారాష్ర్ట ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, కేవలం ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించినట్టు గుర్తు చేశారు.   కేసీఆర్, హరీశ్‌లను శిక్షించాల్సి వస్తే  ఉరి తీయాలని మండిపడ్డారు.

ఏ కారణంతో తుమ్మిడిహట్టి వద్ద ఇచ్చిన హెచ్చరికను కారణంగా చూపి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారో, మేడిగడ్డ విషయంలో అదే హెచ్చరిక ఉందని ఘోష్ కమిషన్ పేజీ నెంబర్ 72లో పేర్కొందని వెల్లడించారు. అందుకే  నివేదికపై హరీశ్ తన అక్కసు వెళ్లగక్కుతున్నారని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. 

బరాజ్‌లను డ్యాములుగా వాడినందునే కుంగుబాటు: మంత్రి ఉత్తమ్ 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఎంతో పారదర్శకంగా, కక్ష సాధింపు లేకుం డా విచారణ జరిపిస్తే కాంగ్రెస్ కమిషన్ అంటారా అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్‌రావు కోర్టును ఆశ్రయించడంతోనే ఎవరు, ఏం దాస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు.

అన్నింటికీ మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని సూచించారు. రూ.38 వేల కోట్లతో ప్రారంభించిన ప్రాణిహిత ప్రాజెక్టును కాదని రూ. 80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, ఆ తర్వాత ఆ ప్రాజెక్టు వ్యయం రూ. 1.27 లక్షల కోట్లకు పెరిగిందని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు రూ. 1.47 లక్షల కో ట్లకు చేరుకుందని తెలిపారు.   

2 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు

ఏడాదికి 195 టీఎంసీల నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం బరాజ్ నుంచి ఐదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 162 టీఎంసీలు మాత్రమే ఎగువకు లిఫ్ట్ చేసిందని స్పష్టం చేశారు. అందులోనూ 32 టీఎంసీలను మళ్లీ సముద్రంలోకే వదిలేశారని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చారని విమర్శించారు. కట్టిన నాలుగేళ్లకే కాళేశ్వరం కూలిపోయిందని, ఆ సమయంలోనూ కేసీఆరే సీఎంగా ఉ న్నారని స్పష్టం చేశారు. 

బరాజ్‌లను డ్యాములుగా వాడినందునే

బరాజ్‌లను డ్యాములుగా వాడినందునే కుంగుబాటుకు గురయ్యాయని పేరొన్నారు. నిపుణులు కమిటీ ప్రాజెక్టును ఒక దగ్గర కట్టాలని సూచిస్తే, వారు వేరే దగ్గర నిర్మించారని తెలిపారు. సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు రాకముందే కాంట్రాక్టర్ల ద్వారా నిర్మా ణ పనులు చేపట్టారని వెల్లడించారు.  ప్రాజెక్టు పూర్తి కాకముందే పూర్తి అయినట్టు రిపోర్టు ఇచ్చారని, బ్యాంక్ గ్యారెంటీలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు.  అప్పటి సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు.  

ఖర్చు చేసే ప్రతి పైసాపైనా బాధ్యత

 కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించి 2023 24లో ఆనాటి ప్రభుత్వం 115 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే తాము అధికారంలోకి వచ్చాక 2024 25లో కాళేశ్వరం నీరు లేకుండా 121 లక్షల ఎకరాల్లో వరి పండించామని చెప్పారు.  ఖర్చు చేసే ప్రతి పైసా పైనా బాధ్యత ఉండాలన్నారు.

33 శాతం పూర్తి అయి న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గాలికి వదిలేశారని, పూర్తి చేసి ఉంటే 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బకాయిలు రూ. 9,735 కోట్లుగా ఉందని ఉత్తమ్ గుర్తు చేశారు.

రిపోర్టులు ఎక్కడా లేవు?

 తుమ్మడిహట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు షిఫ్ట్ అయిన అంశానికి సంబంధించి ఎక్కడ కూడా రిపోర్టులు లేవని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తమ విచారణ లో రూ.38వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు ఎందుకు పెంచారో ఘోష్ కమిషన్ నివేదిక తేల్చిందన్నారు.

తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం తప్పుడు నిర్ణయం అని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. మేడిగడ్డ వల్ల శాశ్వతంగా తెలంగాణ పూర్తిగా నష్టపోయిందన్నారు. తుమ్మడిహట్టి దగ్గర ఏఐబీపీ ప్రోగ్రాంలో ఉందని, దానిని తీసేసి మేడిగడ్డకు మార్చడం ద్వారా కుట్రపూరితంగా తెలంగాణకు నష్టం చేశారని ఆరోపించారు.

రికార్డుల తారుమారు!

రికార్డులను గత బీఆర్‌ఎస్ సర్కారులో తారుమారు చేశారేమోనని తమకు అనుమానం ఉందని మంత్రి ఉత్తమ్  ఆరోపించారు.  పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మ్యానేజ్ చేసి 11శాతం వడ్డీకి ఎక్కువ రుణా లు తీసుకున్నారని తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం గుండెకాయ అన్నారని ఇప్పుడు ఆ గుండెకాయ పగిలిపోయిందన్నారు. మేడిగడ్డలో సీకెంట్ పైల్స్ టెక్నా లజీ చాలా అనుమానించదగ్గదని ఇది చేయకుండా ఉండాల్సిందన్నారు. 

అన్నారం, సుందిళ్ల విషయంలోనూ ఇదే టెక్నాలజీ వాడారు కాబట్టి అక్కడ నీటిని నిల్వ చేయవద్దని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు డిజైన్ చేసింది కట్టింది, కూలింది కూడా మీ హయాంలోనే అని తెలిపారు.  

ఘోష్ కమిషన్ ఓ చెత్త రిపోర్టు: మాజీ మంత్రి హరీశ్ రావు

 ఘోష్ కమిషన్ తాము చెప్పింది పట్టించుకోలేద ని.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మాత్రమే విన్నదని, అందుకే దానిని పీసీసీ కమిటీ అంటున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ కేవలం 20 కి.మీ దూరమే అని ఆయ న అంటున్నారని.. కానీ 116 కి.మీ. దూరమని స్పష్టం చేశారు.

ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్టును తాము పట్టిం చుకోలేదా.. ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా అనేది చర్చిద్దామని అన్నారు. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోయేందుకు తాము ఎక్స్‌పర్ట్ కమిటీని సలహా అడిగామన్నారు. మేడిగడ్డ వద్ద 105 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రలో ఎలాంటి ముంపు ఉండబోదని సలహా ఇచ్చారని అ న్నారు. అయితే మేడిగడ్డ వద్ద ఫీజిబిలిటీ ఉందని..

అయితే అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించేందుకు అవకాశం లేదని చెప్పిందన్నారు. ఇదే అంశాన్ని ఘోష్ కమిషన్‌కు ఎక్స్‌పర్ట్ కమిటీ వివరా లు కూడా అందించారని హరీశ్ తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏలో ప్రపంచంలోనే అతి గొప్ప నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు ఉన్నారని ఉత్తమ్ చెప్పారని.. కానీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎన్‌డీఎస్‌ఏ బిల్లు వచ్చినప్పుడు పార్లమెంటులో వ్యతిరేకించారని గుర్తుచేశారు.

ఎన్‌డీఎస్‌ఏకు దేశమంతా ఒకే నీతి ఉంటుందా? తెలంగా ణకు మరో నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. పోలవరం అనేకసార్లు కూలిపోయినా ఇదే ఎన్‌డీఎస్‌ఏ కనీసం పట్టించుకోలేదన్నారు. పోలవరం కట్టిన చీఫ్ ఇంజినీర్  వచ్చి ఇప్పుడు మేడిగడ్డపై రిపోర్ట్ ఇస్తే అది గొప్పదని ఉత్తమ్  సర్టిఫికెట్ ఇస్తున్నారని అన్నారు.

ఎక్స్‌పర్ట్ కమిటీ చెప్పినందునే.. 

ఎక్స్‌పర్ట్ కమిటీ సూచన మేరకు తాము మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నేరుగా తీసుకుపోవడాన్ని ఆపేసినట్లు హరీశ్‌రావు తెలిపారు. తమ సూచ న మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని ఎక్స్‌పర్ట్ కమిటీ ఘోష్ కమిషన్ దృష్టికి తీసుకుపోయారని తెలిపారు. మేడిగడ్డపై ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పాజిటివ్‌గా ఉందని  తెలిపారు. రిటైర్డ్ ఇంజినీర్ల రిపోర్టును ఎప్పుడూ తొక్కిపెట్టలేదన్నారు. వారి సూచన వల్లే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు.

కాళేశ్వరం కమిషన్ తనను అడిగిన ప్రశ్నలు... తాను చెప్పిన సమాధానాలను హరీశ్ సభలో చదివి వినిపించారు. ఎక్స్‌పర్ట్ కమిటీ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించడం సాధ్యం కాదని చెప్పిందని తాను సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. నీళ్లు లేకపోవడం వల్లే తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు తెలిపారు. రిటైర్డ్ ఇంజినీర్లు, మినిట్స్ ఆఫ్‌ద కమిషన్ ఎంక్వైరీ కాపీ, ఎక్స్‌పర్ట్ కమిటీ అఫిడవిట్ రిపోర్ట్ ప్రకారం తమ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డకు మార్చిందని చెప్పినా సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రాణహిత కూడా అప్పటి కాంగ్రెస్ సర్కారు డీపీఆర్ లేకుండా, మహారాష్ట్ర అనుమతులు లేకుండా టెండర్లు పిలవలేదా? నారాయణ పేట లిఫ్ట్ ఇరిగేషన్‌కు కూడా డీపీఆర్, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే టెండర్లు పిలిచినట్లు గుర్తుచేశారు. జలయజ్ఞంలోనూ అదే పరిస్థితి కనిపించింద న్నారు. సీతారామ ప్రాజెక్టు శంఖుస్థాపన సందర్భం గా పొంగులేటి యాడ్ ఇచ్చినట్లుగా హరీశ్ పేర్కొన్నా రు. అపరభగీరథుడు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారని తెలిపారు. 

650 పేజీల రిపోర్ట్‌పై గంట సరిపోతుందా?

650 పేజీల రిపోర్ట్ మీద గంట సేపట్లో ఎలా మా ట్లాడతామని హరీశ్‌రావు ప్రశ్నించారు. తాను మాట్లాడుతుంటే 28సార్లు అడ్డుపడ్డారని అన్నారు. ఎస్‌ఎల్ బీసీ, సుంకిశాల కూలితే, వట్టెం పంప్‌హౌస్ మునిగితే, పెద్దవాగు కొట్టుకుపోతే ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు రాదని.. ఎందుకు కమిషన్లు వేయరని ప్రశ్నిచారు. కౌన్సిల్‌లో కోదండరాం అడిగిన ప్రశ్నకు సుందిళ్ల, అ న్నారం బ్యారేజీలు బాగున్నాయని ఉత్తమ్ సమాధా నం ఇచ్చారని గుర్తుచేశారు.

7వ బ్లాక్‌ను పునరుద్ధరిం చి తిరిగి ఆపరేషన్‌లోకి తీసుకురావచ్చని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందన్నారు. 7వ బ్లాకును పునర్మించడం ద్వారా మేడిగడ్డను పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందన్నారు.  ఓ బ్లాక్ కట్టేందుకు రూ. 400కోట్ల లోపు అవుతుందన్నారు. కాళేశ్వరానికి 3 రకాల వాటర్ సోర్స్ ఉందన్నారు.

వంద కంపోనెంట్లలో మేడిగడ్డ ఒక్కటే

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో వంద కాంపొనెంట్లలో మేడిగడ్డ ఒక్కటి మాత్రమేనని హరీశ్‌రావు అన్నారు. ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయన్నారు. ఎల్లంపల్లి నుంచి కూడా పంపులు ఆపరేట్ చేయవచ్చన్నారు. మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం నుంచి నీళ్లిచ్చామని మంత్రి అంటున్నారని.. అవి ఏమన్నా గాల్ల్లో వచ్చాయా అని ప్రశ్నించారు.  కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్‌కు మంచినీళ్లు కాళేశ్వరం ద్వారా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎలా ప్రక టిస్తారని అన్నారు. 3 పియర్స్ మాత్రమే కూలాయని వాటిని రిపేర్ చేస్తే సరిపోతుందన్నారు.

ఎల్లంపల్లి, మిడ్‌మానేరు పూర్తిచేసింది.. నీళ్లు నింపిందే తమ సర్కారు అన్నారు. మేడిగడ్డ కూలలేదని.. కుంగిందన్నారు.కాంగ్రెస్ హయాంలో కొట్టుకుపోయిన పాలెం వాగుపై తాము ఎలాంటి కమిషన్ వేయకుండానే పునరుద్ధరించామన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఇంజినీర్లు సరైన అవగాహన కల్పించడం లేదన్నారు. కాళేశ్వరం 20 లక్షల ఎకరాలకు నీరందించిందన్నారు. ప్రాణహిత, కాళేశ్వరానికి చాలా తేడా ఉందన్నారు.

ప్రాణహిత వద్ద ప్రాజెక్టు కడితే అది వృథాగా మారేదన్నారు. ప్రాణహిత సామర్థ్యం 16 టీఎంసీ లు అని, కానీ కాళేశ్వరంలో 141 టీఎంసీలతో 15 రిజర్వాయర్లు కట్టామన్నారు. కాళేశ్వరం డీపీఆర్‌ను సీడ బ్ల్యూసీకి ఇచ్చామని.. తుమ్మడిహట్టి వద్ద నీళ్లు లేవని తాము అందుకే డీపీఆర్ మారుస్తున్నామని చెప్తే తమ కు 11 అనుమతులు వచ్చాయన్నారు. అందుకే ఈ ప్రాజెక్టుపై పూర్తిగా వివరించేందుకు తనకు దయ ఉంచి రెండు గంటల సమయం ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వానిది బురద రాజకీయం

రాష్ట్ర ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుందని వి మర్శించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం కమిష న్లు, చర్చలు పెడుతున్నారని మండిపడ్డారు.  8బీ, 8సీ పాటించకుండా నిబంధనలు అనుసరించలేదని తా ము కోర్టుకు వెళ్లామని, ఈ కమిషన్ రిపోర్టు నిలబడే ది కాదని ఏ క్షణానైనా స్టే వస్తదనే భయంతో ఆదరాబాదరాగా ఆదివారం అయినా అసెంబ్లీలో చర్చకు పెట్టారని చెప్పారు.

ఘోష్ కమిషన్ విచారణ చట్టబ ద్ధంగా, విధివిధానాలను పాటిస్తూ నిష్పాక్షికంగా విచారణ జరిగిందా అని చర్చించాల్సిన అవసరం ఉంద న్నారు. కుట్రపూరితంగా కమిషన్ ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్టును తాము విమర్శిస్తే తప్పు ఎలా అవుతుంద ని ప్రశ్నించారు. సీఎం స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి క మిషన్ రిపోర్టును ఎలా బయటపెడుతారని హైకోర్టు తప్పుపట్టిందని, వెంటనే పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలని ఆదేశించిందన్నారు.

తాము అసెంబ్లీలో చర్చ చేయవద్దని కోర్టుకు పోలేదు, రిపోర్టును ట్రాష్ చేయాలని మాత్రమే కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. కేసీఆర్ నాడు కాళేశ్వరం మీద పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తే కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రిపేర్ కాకుండా వెళ్లారని ఎద్దేవా చేశారు. దీంతో ఉత్తమ్ స్పందిస్తూ హరీశ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, లక్ష కోట్ల అవినీతి చేసి నవ్వడానికి సిగ్గుండాలని తీవ్రంగా మండిపడ్డారు. 

మసిబూసి మారేడు కాయ

కమిషన్ రిపోర్టు కోర్టు ముందు నిలబడదని, ఇదొక డొల్ల రిపోర్టు, చెత్త రిపోర్టు అని హరీశ్ విమర్శించారు. మసిబూసి మారేడు కాయ చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి సిద్దహస్తుడని చెప్పారు. పీసీ ఘోష్‌కు అన్ని వివరాలు సమర్పించామని, వారికి డౌట్ ఉంటే సీడబ్ల్యూసీని విచారించాలి కదా అని ప్ర శ్నించారు.  కాంగ్రెస్  ఎందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేదని, ఎందుకు పూర్తి చేయలేదన్నారు. 

తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినప్పుడు నీళ్ల ప్రవాహం ఎలా పెరుగుతుందో చెప్పాల ని మంత్రి జూపల్లి అడుగగా హరీశ్ స్పందించారు. మేడిగడ్డకు మార్చుతూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణ యంలో ఆనాడు కృష్ణారావు కూడా భాగమేనని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు అని, మహారాష్ట్ర వైపు 16 వాగులున్నాయని, తెలంగాణ వైపు 8 వాగులున్నాయని తెలిపా రు. ఇవన్నీ మేడిగడ్డకు ముందు గోదావరిలో కలుస్తాయని, వీటి ద్వారా మొత్తంగా మేడిగడ్డ దగ్గర 120 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని వివరించారు.

కేసీఆర్ చెప్పారు.. హరీశ్ ఇంప్లిమెంట్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

7వ బ్లాక్ రీ కన్‌స్ట్రక్షన్ చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నింపవచ్చని హరీశ్‌రావు అంటున్నారని.. అయితే 7వ బ్లాక్‌లో వాడిన టెక్నాలజీనే మూడు బ్యారేజీల్లోనూ వాడారని.. అందుకే మూడు ఉపయోగం లేకుండా పోయాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ బ్యారేజీల్లో సీకెంట్ పైల్స్‌తో కట్టిన విధంగా దేశంలో ఎక్కడా లేదన్నారు. సీడీఓ అధికారులు సైతం ఘోష్ కమిషన్‌కు చెప్పారని అన్నారు.

కేసీఆర్ చెప్పారు.. అల్లుడు హరీశ్ ఇం ప్లిమెంట్ చేస్తారని నిలదీశారు. టెక్నికల్ అంశాలను సైతం వీళ్లు అనుసరించలేదన్నారు.   సీకెంట్ పైల్స్‌కు సంబంధించి ఆనాటి మంత్రిగా హరీశ్ బాధ్యులు అని ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో ఇచ్చారని తెలిపారు.

ఒక్క మేడిగడ్డలోని ఏడో బ్లాక్ మాత్రమే కాకుండా మూడు రిజర్వాయర్ల పరిధిలో నిర్మాణం చేసిన టెక్నాలజీపై ఎన్‌డీఎస్‌ఏ ప్రశ్నించిందన్నారు. ఘోష్ కమిషన్, ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ రిపోర్టులు అన్నీ ఒకేలా ఉన్నాయ న్నారు. ఇందుకు మామ, అల్లుళ్లే బాధ్యులని అన్నారు. లక్ష కోట్లు ఎలా కొల్లగొట్టారో, మీ స్కెచ్ ఏంటో రాబోయే రోజుల్లో తేలుతుందన్నారు.  

కోర్టుకు ఎందుకువెళ్లారు: డిఫ్యూటీ సీఎం భట్టి  

తప్పు చేయకపోతే ఘోష్ కమిషన్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని కేసీఆర్, హరీశ్‌లను డిఫ్యూ టీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు. కేసీఆర్ డిజైన్ చేస్తే హరీశ్‌రావు ఎగ్జిక్యూట్ చేయడం వల్లే కాళేశ్వం కూలిపోయిందన్నారు.  దశాబ్దాల క్రితం కట్టిన అనేక ప్రాజెక్టులు నేటికీ సాగు, తాగునీరు అందిస్తున్నాయని కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  పీసీ ఘోష్ చెప్పిందే తాము వివరించామన్నారు.

జ్యుడీషియల్ రిపోర్టును కూడా చెత్త రిపోర్ట్ అంటున్న మీరు ఏమైనా దైవాంశసంభూతులా అని ప్రశ్నించారు. అందరినీ విచారించిన తర్వాతనే ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.  తాము కక్షసాధింపునకు పాల్పడకుండా జ్యుడీషియల్ కమిషన్ వేసినట్లు తెలిపారు. సభలో పెట్టవద్దని కోర్టుకు కూడా పోయారని అన్నారు. తప్పుచేసి ఉండకపోతే కోర్టుకు ఎందుకు పోతారని ప్రశ్నించారు. లక్ష కోట్ల కోసం డిజైన్ మా ర్చారని అన్నారు.

క్యాబినెట్ అప్రూవల్ ఉందని అం దరినీ తప్పుదారి పట్టించారని తెలిపారు. కేసీఆర్ చెప్పారు.. హరీశ్ రావు కట్టారని.. కానీ ఇద్దరూ ఇంజనీర్లే కాదన్నారు. కాళేశ్వరం రిపోర్టు బయటకు వస్తే తమ పరువు ఎక్కడ పోతుందోననే భయంతోనే కోర్టుకు పోయారని విమర్శించారు.

కాళేశ్వరరావు కూడా ప్రాజెక్టులాగే కుంగిపోతున్నారని, నిటారుగా నిలబడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల దోపిడీని బయటపెట్టే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. కేసీఆర్ సభకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెబితే బాగుంటుందన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించనందునే ఏపీకి ఇప్పు డు నీళ్లు వృథాగా పోతున్నాయి కాబట్టే తాము బనకచర్ల ప్రాజెక్టు కట్టుకుంటామని అంటోందన్నారు.