calender_icon.png 28 January, 2026 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కవరు జరభద్రం

17-01-2026 12:20:10 AM

ఆచార్య మసన చెన్నప్ప :

కొన్ని రోజుల తర్వాత సిటీలో ఐ.ఐ.ఎమ్.సి వారు నిర్వహించిన ‘సాహిత్య సమాలోచన’ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పొల్గొన్నాను. నా శిష్యులెంతోమంది కాళోజి, సినారె, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల మీదుగా పత్ర సమర్పణ చేశారు. సభలో నాకు నిర్వాహకులు గౌరవంగా శాలువా కప్పి ఒక కవరు చేతికిచ్చారు.

నగరంలో ఎప్పుడూ ఏదో ఒక సాహి త్య కార్యక్రమం గాని, సాంసృ్కతిక కార్యక్రమం గాని జరుగుతూనే ఉంటుంది. నేను కొంచెం ఆధ్మాత్మికంగా కొన్ని విషయాలు తెలిసినవాణ్ణి గనుక భక్తి కార్యక్రమా లకు కూడా పిలుస్తుంటారు. నలబై ఏళ్లు సాహిత్యం బోధించాను గనుక సాహిత్య కార్యక్రమాలకు ఎక్కువగా పిలుస్తుంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆసక్తికరమైంది. కొందరు స్వయంగా ధనాన్ని వెచ్చించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరికొందరు ఇత రుల నుంచి విరాళాలు సేకరించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. విరాళాలు సేకరించిన వారు పూర్తిగా ఆ ధనాన్ని కార్యక్రమాలకు వినియోగిస్తారనే గ్యారంటీ ఏమీ లేదు.

నిజానికి సాహిత్య సాంసృ్కతిక సంస్థలన్నీ ఇంచు మించుగా ఇతరులిచ్చిన విరాళాలతోనే, కార్యక్రమాలు జరుపుతాయి.అందుకే వాటి బ్యానర్ల మీద ‘ఫలానా వారి సౌజన్యంతో’ అనే మాట స్పష్టంగా ఉంటుంది. ఎవరైనా ప్రత్యక్షంగా పూజా కార్యక్రమాలను జరపాలనుకున్నప్పుడు వక్తల కోసం విచారిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. ఈ మధ్యవర్తులు పెళ్లిళ్లు కుదిరించే మధ్యవర్తుల్లాంటి వారే. ఈ మధ్యవర్తులు ‘ఫలానా రోజు, ఫలానా చోట కార్యక్రమం ఉంది.

ఫలానా టైంకు రావాలని కోరుతారు’. ‘ఇంత పారితోషికం ఇస్తామండి’ అని ముందుగానే ఆశ జూపేవారు కూడా ఉంటారు. తీరా వక్తలుగా పాల్గొన్నవారు, కార్యక్రమం జరిగే చోటికి వెళ్లినప్పుడు ఆ మధ్యవర్తులు కనిపించరు. కార్యక్రమం పూర్తి అవుతున్నసమయంలో ప్రత్యక్షమై హడావుడి చేస్తారు. మరీ చిత్రం ఏమంటే, కార్యక్రమ నిర్వాహకుల చేతి నుం చి శాలువాను గ్రహించి అతిథులను సత్కరిస్తారు. అదే సమయానికి కెమెరా వాడు రావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. కార్యక్రమానికి సంబంధించిన వార్త పేపర్లో రావాలంటే ఈ మధ్యవర్తులదే బాధ్యత.

సరాసరి వేదిక పైకి..

దసరా, దీపావళి, వినాయకచవితి పండుగలు వచ్చినప్పుడు, హైదరాబాద్ నగరం లౌ డ్‌స్పీకర్లతో కోలాహలంగా ఉంటుంది. కార్యక్రమం జరిగే మండపానికి ఫలానా అతిథి వస్తున్నాడని మందుగానే వెల్లడించడం వల్ల, తెలిసినవారు రావడం సాధారణం! వినాయకచవితి సందర్భంగా నగరంలో ఏర్పా టైన కార్యక్రమానికి ఒకరోజు ముఖ్య వక్తగా నన్ను రమ్మని నాకు తెలిసిన మిత్రుడు కోరా డు. దేనిమీద మాట్లాడాలో చెప్పమన్నా ను.‘వినాయక విజయాన్ని గూర్చి అందరు మాట్లాడుతారు. మీరు ఉపనిషత్తుల మీద మాట్లాడండి’ అని కోరాడు ఆ మిత్రుడు. ఉ పనిషత్తుల మీద మాట్లాడటమంటే నాకు చాలా ఇష్టం.

ప్రసంగించాల్సిన రోజు రానే వచ్చింది. కాని వర్షం వస్తుంది. ఐనా మాటి చ్చాం కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని సమయానికి ముందే మండపానికి చేరుకున్నా ను. వారెవరో నాకు తెలియదు కాని, నాకు అంతకుపూర్వమే పరిచయం ఉన్నట్లు, వారు నా దగ్గరికి వచ్చి స్వాగతం చెప్పారు. అంత లో క్యాబ్ వాని కేక వినిపించింది. క్యాబ్ వా నికి డబ్బులు చెల్లించకుండా మండపానికి రావడం పొరపాటైంది. అయితే నిర్వాహకు లు క్వాబ్ వానికి డబ్బులు ఇస్తారేమోనని నేను భావించాను. కాని అదేమీ జరగలేదు. నేనే వానికి  డబ్బిచ్చి పంపించాను. మండపంలో యాభై మందిదాకా ఉన్నారు.

సరా సరి నన్ను వేదిక మీదికి పిలిచారు. ఆలస్యం చేయకండా నన్ను మాట్లాడమన్నారు. నన్ను పరిచయం చేస్తారేమో ముందుగా అని ఆశించాను. కాని నన్నుగూర్చి ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు. సరే అనుకొ ని ఒక్క నలబై నిమిషాలు  ప్రసంగించాను. బృహదారణ్యకోపనిషత్తును ‘బృహద్గీత’గా ముత్యాలసరాల్లో తెనిగించినవాణ్ణి. అందులోని అన్న సంవృద్ధినిగూర్చి,అన్నదానం గూర్చి-రెండు ముత్యాలసరాలను వినిపించాను.

‘పరమపురుషుని సృష్టిలోగల

అన్న భండారమ్ము గొప్పది 

చిన్న నోటితొ తిన్నదెంతయు

నామ మాత్రము కాక యేమగు? 

పరులకీయక ఎవడు తినునో 

వానికెన్నడు శుభము కలుగదు

పరులకిచ్చీ తాను దింటూ 

బ్రతకనేర్చిన వాడె ధన్యుడు’

ఐదారు వందలున్నాయి..

ప్రేక్షకులు నా పద్యాలను విని చపట్లు కొట్టడం సంతోషాన్ని కల్గించింది. ఇంకా నా ప్రసంగం వినాయకుని గురించి, విఘ్నేశ్వర శబ్దంలోని ఔచిత్యం గురించి కొనసాగింది. విఘ్నేశ్వరుడు దుష్టులకు విఘ్నాలు కల్గిస్తా డు. కాని,మంచివారికి శుభంకరుడని చెప్తూ నా ప్రసంగాన్ని ముగించాను. ప్రసంగం పూర్తికాగానే నిర్వాహకులు శాలువా కప్పి ఒక కవరు నాచేతికందించారు. వాటిని నా చేతి సంచిలో భద్రపరుచుకున్నాను. అప్పుడే ప్రత్యక్షమైన నా మిత్రుడు ‘నేను పట్టుకుంటా ను సార్!’ అని నా చేతి బ్యాగును అందుకున్నాడు.

నేను తొందరగా వెళ్లాలని చెప్పడం వల్ల నాకే ప్రసాదాన్ని ముందుగా అందించా రు. వర్షంలోనే క్యాబ్ బుక్ చేసుకొని ఆటో ఎక్కాను. అప్పటికి గుర్తుకు వచ్చి మిత్రుని చేతి నుంచి నా బ్యాగును తీసుకున్నాను. కుండపోత వర్షంలో ఇంటికి చేరుకుని, నిర్యాహకులిచ్చిన కవరు తెరిచి చూశాను. అందులో ఇదారు వందల కంటె ఎక్కువ లేవు. మిత్రుడు చెప్పినట్లు వెయ్యికి పైగా ఉం డాలి కదా. క్యాబ్ ఖర్చులు వారిచ్చిన దానికి సరిపోయాయి. విచారించాల్సిన పనేమీ లే దు. కాని నాకో సందేహం కల్గింది. నిర్వాహకులిచ్చింది నిజంగా అంతేనా? అని. కొద్దిసే పు నిద్రపట్టలేదు. క్రమంగా నిద్రలోకి జారుకున్నాను.  

ఎవరిచ్చినా జేబులోకి..

కొన్ని రోజుల తర్వాత సిటీలో ఐ.ఐ.ఎమ్.సి వారు నిర్వహించిన ‘సాహిత్య సమాలోచన’ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పొల్గొన్నాను. నా శిష్యులెంతోమంది కాళోజి, సినారె, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యుల మీదుగా పత్ర సమర్పణ చేశారు. సభలో నాకు నిర్వాహకులు గౌరవంగా శాలువా కప్పి కవరు చేతికిచ్చారు. అంతలో నా పరిశోధక విద్యార్థి ఒకరు వచ్చి శాలువాను మడతపెడతానని చెప్పి, నా చేతిలోని కవరు కూడా తీసుకోబోయాడు. కాని నేను శాలువాను, కవరును అతనికివ్వలేదు. పాపం ఆ విద్యార్థి నేను చేసిన పనికి బిక్కమొహం వేశాడు.

అప్పటికి రెండు రోజు లైంది. ఒకరోజు నా పరిశోధక విద్యార్థి ఫోన్ చేసి ‘సార్ ఆరోజు నాకు చాలా బాధ కల్గిం ది. శాలువాను మడతపెడుతానంటే ఇవ్వలేదు. కవరు కూడా ముట్టుకో నివ్వలేదు’ అని తన బాధను వ్యక్తపరిచాడు. అప్పుడతనికి అదే ఫోను ద్వారా అంతకుముందు వినాయకచవితి నాడు జరిగిన సంఘటనను వివరించాను. అది విని ‘సారీ సార్’ అన్నా డా శిష్యుడు. అప్పటినుంచి ఏ సభకు వెళ్లి నా, నిర్వాహకులు కవరిస్తే దాన్ని జేబులో జాగ్రత్తగా దాచుకోవడం మరవలేదు.

 వ్యాసకర్త సెల్: 9885654381