calender_icon.png 29 January, 2026 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంధం బలోపేతం కావాలి!

17-01-2026 12:16:03 AM

బంధాలు బలంగా ఉంటేనే భవిష్యత్ తరాలు భద్రంగా ఉంటాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో మృగ్యమవుతున్న మానసిక బంధాలు, మానవీయ విలువలను మళ్లీ బతికించాలంటే స్వార్ధం వీడాల్సిన అవసరముంది. బలమైన బంధాలు, బాంధవ్యాలు ఏర్పడాలంటే పౌరులుగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. మాట్లాడితే కాలం మారింది అంటారు కానీ వాస్తవానికి మారింది మనిషి. మనిషి అంటే నవరంధ్రాలపుట్ట. తన మనుగడ కోసం మన, పర అనే భేదం లేకుండా నిలువెల్లా స్వార్దాన్ని నింపుకోవడంలో పోటీ పడుతున్నాడు. నిజానికి గడచిన కాలమంతా నిబద్దతతో కూడిన బలమైన మానసిక బంధాలతో, బంధుత్వాలతో భారత సమాజం అలరారింది.

అలాంటి స్థితి నుంచి ఇవాళ పల్లెలు, పట్టణాల్లో ఉమ్మడి కుటుంబాలు, మానసిక బంధాలు కనపడని రోజులు చూస్తున్నాం. ఆధునిక జీవన యుగంలో యువత పని ఒత్తిడి, లక్ష్యసాధన పైనే ఎక్కువ సమయం వెచ్చించడం, మునుపటి తరంలా విరివిగా అత్మీయులను కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకునే తీరిక లేకపోవడం, మొబైల్ ఫోన్‌లో పలకరింపులతో బంధాలు పలుచన అవుతున్నాయనేది కాదనలేని నిజం. బంధాలకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా మన స్సు కల్లోలంగా మారుతుంది. ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు. కుటుంబంతో, సన్నిహితులతో బలమైన బంధం పెంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు బంధాలు బలపడతాయి.

అవి మనల్ని మానసిక బలవంతులను కూడా చేస్తాయని గుర్తించాలి.  ఇందుకోసం కాలానుగుణంగా కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను, తల్లిదండ్రుల విలువను, తోబుట్టువుల ప్రేమానురాగాలను, ఎదుటివారి పట్ల సోదరాభావంతో మెలిగే నడవడికను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. పాశ్చాత్య వ్యామోహాలు పెరిగిపోయి నేడు కుటుంబాలు అనేక సమస్యలకు గురవుతున్నాయి. యాంత్రిక జీవనంతో అసంతృప్తి, ఉద్రేకాల నడుమ ఉగిసలాడుతున్న మనిషి.. కుటుంబసభ్యుల మధ్య దెబ్బతింటున్న ప్రేమానురాగాలను గుర్తించలేకపోతున్నాడు. ఇప్పటి యువతరానికి బంధాలంటే పెద్దగా తెలియదు.

పాశ్చాత్య దేశాల మోజులో పడి విదేశాల్లో పెద్ద చదువులు చదివి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే క్రమంలో జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల మది తలుపును తెరిచి చూసేన్తే ప్రేమానురాగాల గొప్పతనం అర్థమవుతుంది. ఉద్యోగ రీత్యా, ఉపాధికోసం ఉన్న ఊరును వదిలి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన యువత ఇవాళ పండగ వేళల్లో మాత్రమే తమ సొంతూళ్లకు తిరిగి వచ్చి తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఆప్తులు, చిన్ననాటి స్నేహితులతో కులాసాగా గడిపి ఒంటరితనం అనే బరువును దించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మనిషికి మనిషికి మధ్య అరమరికలు లేని సంబంధ బాంధవ్యాల కోసం, ఎదుటి వారిపట్ల ప్రేమ, దయ, కరుణలతో మెలిగే అందమైన ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ముందుగా మనిషిలో పరివర్తన జరగాలి. అందుకు ఈ సంక్రాంతి పండగనే  మొదటి మెట్టుగా బావించి యువత ప్రేమాను రాగాలను ప్రోదిచేసే పనికి ఉపక్రమించాలని ఆశిద్దాం. జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు. ఇకనైనా బాధ్యతగా  అరమరికలు లేని సమాజ ఏర్పాటుకు అందరం కదలాలని కోరుకుందాం.

 ధీరన్ కొడారి, 8008200664